దేవాదుల ప్రాజెక్టు భూసేకరణపై హైకోర్టు స్టే

దేవాదుల ప్రాజెక్టు భూసేకరణపై హైకోర్టు స్టే

హైదరాబాద్, వెలుగు: దేవాదుల లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులో భాగంగా నవాబ్‌‌పేట్‌‌ రిజర్వాయర్‌‌ డిస్టిబ్యూటరీ కెనాల్‌‌ కోసం ఇద్దరు రైతుల నుంచి భూసేకరణ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. 2018 భూసేకణ నోటిఫికేషన్‌‌ ప్రకారం అధికారులు తమ భూమిని స్వాధీనం చేసుకోవడంపై స్టే ఇవ్వాలని యాదాద్రి భువనగిరి జిల్లా గండాల మండలం రామారమ్‌‌ రైతులు వెంకటరెడ్డి,  ఎం. మహిపాల్‌‌ హైకోర్టులో రిట్లు దాఖలు చేశారు. వీటిని మంగళవారం విచారించిన జస్టిస్‌‌ వినోద్‌‌కుమార్‌‌ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

నోటిఫికేషన్‌‌ ఇచ్చిన ఏడాదిలోగా భూసేకరణ చేయాలని, ఇంతకాలం గడిచిన తరువాత భూసేకరణకు అధికారులు తీసుకునే చర్యలను అడ్డుకోవాలని పిటిషనర్‌‌ న్యాయవాది కోర్టును కోరారు. ఈ ఏడాది రైతుబంధు డబ్బులు కూడా పిటిషనర్ల ఖాతాలో జమయ్యాయని చెప్పారు. వాదనలు విన్న జస్టిస్‌‌.. ఇద్దరు రైతుల నుంచి భూములను స్వాధీనం చేసుకోవద్దని అధికారులకు ఉత్తర్వులిచ్చారు. ఈ విషయంపై కౌంటర్‌‌ దాఖలు చేయాలని భూసేకరణ అధికారిని ఆదేశిస్తూ, విచారణను ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేశారు.