
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంబీబీఎస్, బీడీఎస్ రెండో విడత కౌన్సింగ్ ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఏం జరుగుతుందో ఓ కన్నేసి ఉంచాలని, పట్టించుకోకపోతే ఎలాగని ప్రభుత్వాన్ని నిలదీసింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్లకు విఘాతం కలిగేలా, జీవో 550ని ధిక్కరిస్తూ రెండో విడత కౌన్సింగ్ నిర్వహించినట్లు ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడింది.
ముందుగా ఓపెన్ కోటా సీట్లు భర్తీ చేస్తే అందులో ప్రతిభ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీట్లొస్తాయని, అలా కాకుండా ముందు రిజర్వేషన్ కోటా అమలు చేయడంతో ఆ కోటాకు చెందినవాళ్లు జనరల్‌లో మెరిట్ సీట్లను నష్టపోయారని ఆదిలాబాద్ జిల్లా నుంచి నూతెంకి భావన ఇతరులు వేసిన రిట్ పిటిషన్ ను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్‌కుమార్, జస్టిస్ పి.కేశవరావుల డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. గతనెల నిర్వహించిన రెండో విడత కౌన్సెలింగ్ లో రిజర్వేషన్ల కేటగిరీ క్యాండిడేట్లు నష్టపోయారని పిటిషనర్ తరఫున సీనియర్ లాయర్ ఎ. సత్యప్రసాద్ వాదనలు వినిపించారు.
ఫస్ట్ కౌన్సెలింగ్‌లో వివిధ కారణాల వల్ల భర్తీ కాని సీట్లను రెండో కౌన్సెలింగ్‌లో భర్తీ చేయాలని, వీటిని ముందుగా జనరల్ కోటా సీట్లు, ఆ తర్వాత రిజర్వేషన్ కోటా సీట్లను భర్తీ చేయాలని జీవో 550 చెబుతోందన్నారు. తర్వాత సీటు వస్తుందో రాదోనన్న భయంతో రిజర్వేషన్‌లో సీట్లను ఎంచుకున్నారని, దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్లు ఓపెన్ కోటా సీట్లను నష్టపోయారని వాదించారు. దీనిపై రెండు జీవోలు ఉన్నాయని, వివరాల కోసం గడువు కావాలని ప్రభుత్వ అదనపు ఏజీ రామచందర్‌రావు బెంచ్ ను కోరారు. తర్వాతి విచారణను 13కి వాయిదా వేస్తున్నామని, ఈలోగా కౌంటర్ దాఖలు చేయాలని కాళోజీ యూనివర్సిటీ, వైద్య శాఖకు బెంచ్ ఆదేశించింది.