బడి కూల్చివేతపై హైకోర్టు స్టే

బడి కూల్చివేతపై హైకోర్టు స్టే
  • కౌంటర్​ దాఖలు చేయాలని నోటీసులు జారీ
  • విచారణ జూన్​15కు వాయిదా 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మధురానగర్‌లోని బడి కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలు తెలియజేయాలని ఆఫీసర్లను ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. విచారణను జూన్‌15కు వాయిదా వేస్తూ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ తుకారాంజీతో కూడిన బెంచ్ ఈ మేరకు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. మధురానగర్‌లోని పాత స్కూల్ స్థలంలో స్థానిక విద్యార్థుల కోసం కొత్త భవనాన్ని కట్టేలా ప్రతివాదులను ఆదేశించాలని కోరుతూ అదే ప్రాంతానికి చెందిన కె.రాములు పిటిషన్‌ దాఖలు చేశారు.

సుమారు 25 ఏండ్ల నాటి స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకోవడంతో బడిని మూసేశారు. దీంతో ఇక్కడి పిల్లలు 450 మంది వేరే ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోంది. శిథిల భవనాన్ని కూల్చి కమ్యూనిటీ హాల్‌ను నిర్మించాలని స్థానిక నాయకులు కొందరు నిర్ణయించారు. అక్కడ కమ్యూనిటీ హాల్‌ కట్టొద్దని, స్కూల్ బిల్డింగ్ నిర్మించేలా అధికారులను ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.