
- నిషేధిత జాబితాలో చేర్పు ఉత్తర్వుల అమలు నిలిపివేత
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలోని సర్వే నంబర్ 36/ఈ లోని 17.04 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై హైకోర్టు స్టే విధించింది. రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 22ఏ కింద జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఆదేశాలు జారీ చేసింది. విచారణను సెప్టెంబర్ 2కు వాయిదా వేసింది. గోపన్‌పల్లి సర్వే నంబర్ 36/ఏఏలో 8.36 ఎకరాలు, 36/ఈలో 8.08 ఎకరాలతో కలిపి మొత్తం 17.04 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చుతూ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి జూన్ 23న ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిర్ణయాన్ని భాగ్యనగర్ తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల (గచ్చిబౌలి) మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ హైకోర్టులో సవాల్ చేసింది. తమ భూములను నిషేధిత జాబితాలో చేర్చడం చట్టవిరుద్ధమని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 300ఏలను ఉల్లంఘించిందని పిటిషనర్ న్యాయవాది వాదించారు. గతంలో ఈ భూములపై హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వాదనల తర్వాత హైకోర్టు.. గోపనపల్లి వివాదాస్పద భూములపై స్టే ఇచ్చింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌లకు నోటీసులు ఇచ్చింది. విచారణను వచ్చే నెల 2కి వాయిదా వేసింది.