కమ్మ, వెలమ కుల సంఘాలకు భూ కేటాయింపుపై హైకోర్టు ఫైర్

కమ్మ, వెలమ కుల సంఘాలకు భూ కేటాయింపుపై హైకోర్టు ఫైర్
  • కమ్మ, వెలమ కుల సంఘాలకు కేటాయింపుపై ఫైర్
  • ప్రభుత్వమే కుల విభజనను ప్రోత్సహిస్తున్నట్టుంది
  • కులం బలపడే పనులు చేయడం దారుణం
  • 21వ శతాబ్దంలో కూడా ఇట్లుందంటే మనం ఎటు పోతున్నం
  • ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలకే భూములు ఇవ్వాలని సూచన

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో అత్యంత విలువైన భూములను కమ్మ, వెలమ కుల సంఘాలకు కేటాయించడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. కులాలవారీగా భూ కేటాయింపులపై అభ్యంతరం తెలిపింది. ఇది ఆర్టికల్ 14కు విరుద్ధమంది. కులాల వారీగా విభజనకు దారి తీసేలా రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉందని మండిపడింది. వెలమ, కమ్మ సంఘాలకు భూ కేటాయింపులపై కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ తుకారాంజీ తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ జరిపింది.

వాళ్లు కట్టుకునే బిల్డింగ్స్​లోకి ఇతర కులాల్ని రానిస్తరా

2021లో ఖానామెట్​లో కమ్మ, వెలమ సంఘాలకు ఐదెకరాల చొప్పున భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిల్ విచారణ సందర్భంగా హైకోర్టు ఘాటుగా స్పందించింది. 

కులాలవారీగా భూమి కేటాయింపులపై ఆశ్చర్యం, విస్మయం వ్యక్తం చేసింది. ప్రభుత్వమే కుల విభజనను ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందని కామెంట్​ చేసింది. ‘‘కుల రహిత సమాజం కోసం కృషి చేయాల్సిన సర్కార్‌‌ వాటిని మరింత బలంగా మార్చే పనులు చేయడం దారుణం. కుల ప్రాతిపదికన భూములు ఎలా కేటాయిస్తరు. వాళ్లు కట్టే కమ్యూనిటీ బిల్డింగ్‌‌లోకి ఇతర కులాలను అనుమతిస్తరా. కులాలకు ఆవిధంగా భూములు ఎలా కేటాయిస్తరు. ఇది ఆర్టికల్‌‌ 14కు విరుద్ధం. 21వ శతాబ్దంలో కూడా కులాల ఆధారిత విభజన ఉందంటే మన పయనం ఎటు వైపు ఉందో అర్థం కావడం లేదు. 

మనం ఎటువైపు వెళ్తున్నం. ఇలాంటి ఆలోచనలు చాలా సంకుచితం. అసంబద్ధం. కుల ప్రాతిపదికన భూములు కేటాయించడం సమర్థనీయం కానేకాదు. ప్రభుత్వాలు ఇలా చేయడం ఆమోదయోగ్యం కానేకాదు’’ అని హైకోర్టు కమ్మ, వెలమ కుల భవనాలకు భూమి కేటాయింపులపై తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలకు మాత్రమే ప్రభుత్వం భూములు ఇవ్వాలని, కుల రహిత వివాహాలను ప్రోత్సహించడం వంటి విధానాలు ఉండాలని సూచించింది. ప్రభుత్వం కుల రహితంగా ఆలోచించాలని తెలిపింది. తదుపరి విచారణ లోగా ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని ఆదేశించింది.

ఇది హెటిరోకు చేసిన కేటాయింపు లాంటిదే..

రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి బుద్వేలులో 5 ఎకరాల భూమిని ఎకరం రూ.1 చొప్పున కేటాయిస్తూ 2018 సెప్టెంబరు 9న రాష్ట్ర ప్రభుత్వం జీవో 195 జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ సికింద్రాబాద్ కు చెందిన సోషల్ వర్కర్ కె.కోటేశ్వరరావు మరొకరు హైకోర్టులో పిల్ వేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున లాయర్ చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ.. బాగా డబ్బున్న సంస్థకు ఎకరం రూ.1 చొప్పున 5 ఎకరాలు ప్రభుత్వం కేటాయించడం అన్యాయం అన్నారు. ఆ భూమి విలువ ఇప్పుడు మార్కెట్ రేటు ప్రకారం రూ.300 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. 2017లో కూడా ఇదే సంస్థకు 10 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధమన్నారు. 

అఖిల భారతీయ ఉపభోక్త కాంగ్రెస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్, సచ్చిదానంద పాండే వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎక్ఫాస్ట్ బెంగాల్ తదితర కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులకు విరుద్ధమని చెప్పారు. స్పందించిన హైకోర్టు 2018లో జీవో ఇస్తే ఇప్పటివరకు ఎందుకు పిటిషన్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. తదుపరి విచారణ నాటికి దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. చౌక ధరకు హెటిరోకు చెందిన ట్రస్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూమి కేటాయింపులను ఇటీవల రద్దు చేసిన విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది. ఇది కూడా అలాంటిదే అయినప్పటికీ పిటిషన్ దాఖలు చేయడంలో తీవ్ర ఆలస్యం కావడానికి కారణాలు చెప్పాలని కోరింది. కేటాయించిన ఆ స్థలంలో నిర్మాణాలు ఏమైనా జరిగాయేమో వాటి వివరాలు కూడా చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది.

ఎకరం రూ.50 కోట్లుకు పైనే..

పిటిషనర్‌‌ తరఫున సీనియర్‌‌ లాయర్​ సరసాని సత్యంరెడ్డి వాదిస్తూ నేషనల్‌‌ అకాడమీ ఆఫ్‌‌ కన్‌‌స్ట్రక్షన్‌‌ (ఎన్‌‌ఏసీ) రహదారికి ఆనుకొని హైటెక్‌‌ సిటీ రోడ్డుకు పక్కన ఉన్న 5 ఎకరాల భూమిని ఆలిండియా వెలమ అసోసియేషన్‌‌కు, అయ్యప్ప సొసైటీకి రోడ్డుకు ఆనుకుని ఉన్న మరో 5 ఎకరాల భూమిని కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్యకు కేటాయించడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో అత్యంత ధనిక కులాలకు ఆ స్థాయిలో కోట్లాది రూపాయల విలువైన భూమి కేటాయింపు దారుణమన్నారు. ఎకరం దాదాపు రూ.50కోట్లకు పైనే ఉంటుందని చెప్పారు. దీనిపై ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ స్పందిస్తూ.. ఈ రెండు కులాలకే కాకుండా ఇతర కులాలకు కూడా ప్రభుత్వం భూములు ఇచ్చిందన్నారు. జీవో నంబర్‌‌ 571 ఆధారంగా మార్కెట్‌‌ విలువకు అనుగుణంగా భూకేటాయింపు జరిగిందన్నారు.

శారదాపీఠం, జీయర్ వేదిక్ అకాడమీలకు నోటీసులు

శారదాపీఠం, జీయర్ వేదిక్ అకాడమీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మరో పిల్ ను కూడా హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం గురువారం విచారించింది. సికింద్రాబాద్ కు చెందిన వీరాచారి ఈ పిటిషన్​ను దాఖలు చేశారు. కోట్ల విలువైన భూములను ఎకరానికి రూపాయి చొప్పున ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ప్రతి వాదన చేస్తూ, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. 

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వేదాలను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. శారదాపీఠం, జీయర్ అకాడమీకి భూకేటాయింపులపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని, మంత్రివర్గం తీసుకున్న విధాన నిర్ణయంలో కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. వాదన తర్వాత హైకోర్టు, విశాఖ శారదాపీఠం, జీయర్ అకాడమీలకు నోటీసులు జారీ చేసింది. శారదా పీఠానికి భూ కేటాయింపులపై విచారణను జులై 24కు, జీయర్ అకాడమీ భూ కేటాయింపుపై విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేసింది.