ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డితో క్షమాపణలు చెప్పిస్తాం

ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డితో క్షమాపణలు చెప్పిస్తాం

వరి విత్తనాలు అమ్మకూడదన్న సిద్దిపేట మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డితో క్షమాపణలు చెప్పిస్తామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు.  సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో సుబేదార్ సింగ్, శంకర్ అనే వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈ రోజు కోర్టులో విచారణకు వచ్చింది. వెంకట్రామిరెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీగా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసినందున.. తాము వేసిన పిటిషన్ తో ఫలితం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అందుకే తమ పిల్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు పిటిషనర్ కోర్టుకు తెలిపారు.

అయితే వెంకట్రామిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నమోదైన కేసులో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దాంతో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరయ్యారు. మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో బేషరతుగా క్షమాపణలు చెప్పించి.. స్టేట్మెంట్ నమోదు చేసి కోర్టుకు సమర్పిస్తామని ఆయన కోర్టుకు తెలిపారు.  దాంతో తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ఉత్తర్వులిచ్చింది.