
ముషీరాబాద్,వెలుగు: స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం హైకోర్టులో 30 బీసీ సంఘాలు ఇంప్లేడ్ కేసులు వేశాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243డీ6 ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. మంగళవారం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ నేతృత్వంలో 30 బీసీ సంఘాల ప్రతినిధులు హైకోర్టులో ఇంప్లేడ్ కేసులు వేసిన సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారమే రిజర్వేషన్లు ఉన్నాయని, ఈ అంశంపై సుప్రీంకోర్టుకు ఎవరు వెళ్లినా బీసీలే కేసులు గెలిచే అవకాశం ఉందన్నారు. ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లు పెట్టినప్పుడు 50 శాతం సీలింగ్ ఎత్తివేసిందని, ఇప్పుడు ఏ కోణంలో చూసినా రిజర్వేషన్లపై బీసీలదే పైచేయి అవుతుందన్నారు. రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లి బీసీ సమాజాన్ని ఇబ్బంది పెట్టవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో గుజ్జా సత్యం, పగడాల శ్రావణి, అల్లంపల్లి రామకోటి, రామ్మూర్తి గౌడ్, రాజేందర్, అనంతయ్య, నీల వెంకటేష్, పగిళ్ల సతీష్, భాస్కర్ ప్రజాపతి, అడ్వకేట్ శివ తదితరులు పాల్గొన్నారు.