
న్యూఢిల్లీ: దేశ రక్షణకు భారత ఆర్మీ దళాలు పూర్తిగా కట్టుబడి ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ అన్నారు. లడఖ్‌లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రావత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘లడఖ్‌లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇదే సమయంలో స్వయంప్రతిపత్తి కలిగిన టిబెట్‌లో చైనా చేపడుతున్న సెక్యూరిటీ చర్యల అంశం మా దృష్టికి వచ్చింది. ప్రతి దేశం కూడా తన వ్యూహాత్మక ఆసక్తులను బట్టి రక్షణను పటిష్టం చేసుకోవాలి. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వెంబడి శాంతియుత పరిస్థితులకు విఘాతం కలిగించాలని చైనా యత్నించింది’ అని రావత్ పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా మన రక్షణ వ్యవస్థలో గణనీయ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.