బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భారీ బందోబస్తు 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భారీ బందోబస్తు 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భారీ బందోబస్తు 
సిటీకి చేరుకున్న ఎస్పీజీ.. ప్రధాని భద్రత ఏర్పాట్ల పరిశీలన  
ఎస్పీజీ అధీనంలోకి హెచ్ఐసీసీ, పరేడ్ గ్రౌండ్స్, రాజ్ భవన్ 
నో ఫ్లయింగ్ జోన్లుగా సిటీ, సైబరాబాద్ కమిషనరేట్లు 
సైబరాబాద్ లో రేపట్నుంచి 144 సెక్షన్

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, సీఎంలు, పార్టీ ముఖ్య నేతలు రానున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర బలగాలతో పాటు 8 వేల మంది రాష్ట్ర పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. దాదాపు 1,60‌‌‌‌‌‌‌‌0 సీసీ కెమెరాలతో సిటీ మొత్తం నిఘా పెట్టారు. ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌, ఎమ్మార్పీఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు మరింత పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అనుమానితులను, పాత నేరస్తులను బైండోవర్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌‌‌‌, సైబరాబాద్‌‌‌‌ సీపీ స్టీఫెన్ రవీంద్ర స్వయంగా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. మఫ్టీ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్‌‌‌‌ విభాగాలతో నిఘా పెట్టారు. మీటింగ్స్ జరిగే ప్రాంతాలను పూర్తిగా సీసీ, ఫేషియల్‌‌‌‌ రికగ్నైజేషన్ కెమెరాల నిఘాలోకి తెచ్చారు. వీటిని సైబరాబాద్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌ కమిషనరేట్ సహా డీజీపీ ఆఫీస్‌‌‌‌లోని కమాండ్‌‌‌‌ అండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌కు కనెక్ట్ చేశారు. 

హైసెక్యూరిటీ జోన్లు... 

బందోబస్తును పర్యవేక్షించేందుకు స్పెషల్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ (ఎస్పీజీ) అధికారులు బుధవారం హైదరాబాద్‌‌‌‌ చేరుకున్నారు. ఇద్దరు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులతో కూడిన 25 మంది సభ్యుల టీమ్ హెచ్‌‌‌‌ఐసీసీ, నోవాటెల్‌‌‌‌, సికింద్రాబాద్‌‌‌‌ పరేడ్‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌, రాజ్‌‌‌‌భవన్‌‌‌‌ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది. సైబరాబాద్‌‌‌‌ సీపీ స్టీఫెన్ రవీంద్రతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించింది. బీజేపీ సమావేశాలకు హాజరు కానున్న వారి వివరాలను సేకరించింది. పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని బహిరంగ సభ నేపథ్యంలో అక్కడి పరిసర ప్రాంతాలను పరిశీలించింది. ప్రధాని పర్యటించనున్నఈ ప్రాంతాలన్నింటినీ ఎస్పీజీ తమ అధీనంలోకి తీసుకుంది. స్థానిక లా అండ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ ‌‌‌‌జాయింట్‌‌‌‌ సీపీలు, డీసీపీలతో కలిసి భద్రతా ఏర్పాట్లు సమీక్షిస్తోంది. ఈ క్రమంలోనే హెచ్ఐసీసీ, పరేడ్ గ్రౌండ్స్, రాజ్‌‌‌‌భవన్ ప్రాంతాలను హైసెక్యూరిటీ జోన్లుగా ప్రకటించారు. ప్రధాని సహా మిగతా వీవీఐపీలు, వీఐపీలు నోవాటెల్, మరో 3 స్టార్ హోటళ్లలో బస చేయనున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు.

రూట్‌‌‌‌ మ్యాప్ సీక్రెట్.. 

ప్రధాని టూర్ కు సంబంధించి మినిట్ టు మినిట్ షెడ్యూల్‌‌‌‌ రూపొందిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా రూట్‌‌‌‌ మ్యాప్‌‌‌‌ను సీక్రెట్‌‌‌‌గా ఉంచుతున్నారు. 2న రాత్రి నోవాటెల్ లో, 3న రాత్రి రాజ్ భవన్ లో ప్రధాని బస చేయనున్నారు. మోడీ టూర్‌‌‌‌‌‌‌‌ మ్యాప్‌‌‌‌ను బట్టి  శుక్రవారం 4 ప్రాంతాల్లో ట్రయల్ రన్‌‌‌‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రోడ్డు మార్గంలో ట్రావెల్‌‌‌‌ చేస్తే ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. రూట్ మ్యాప్ పై రాష్ట్ర ఇంటెలిజెన్స్, పీఎంవో అధికారులతో సిటీ పోలీసులు చర్చించారు. ఈ క్రమంలోనే సిక్రిందాబాద్‌‌‌‌ సహా మాదాపూర్‌‌‌‌‌‌‌‌, రాజ్‌‌‌‌భవన్‌‌‌‌ ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ కు ప్లాన్ చేస్తున్నారు. 

హోటళ్లలో సిబ్బంది వివరాల సేకరణ.. 

కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు వస్తున్న నేపథ్యంలో స్టార్ హోటళ్లలో రూమ్​లు బుక్ చేశారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. హోటళ్లలో క్లీనర్స్‌‌‌‌ దగ్గర్నుంచి సిబ్బంది, ఇప్పటికే రూమ్ లలో ఉన్న టూరిస్టుల వివరాలు సేకరిస్తున్నారు. హోటల్‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌ సహా సర్వెంట్ల ఐడీ, ఆధార్ కార్డుల వివరాలు 
సేకరిస్తున్నారు. 

రెండు కమిషనరేట్లలో ఆంక్షలు..  

హైదరాబాద్‌‌‌‌, సైబరాబాద్‌‌‌‌ కమిషనరేట్లను నో ఫ్లయింగ్ జోన్లుగా ప్రకటించారు. హెచ్‌‌‌‌ఐసీసీ, రాజ్‌‌‌‌భవన్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల చుట్టూ 5 కిలోమీటర్ల మేర ఆంక్షలు విధించారు. ఈ మేరకు సీపీలు వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చారు. డ్రోన్లు, పారా గ్లైడర్స్, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్స్‌‌‌‌ను నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. కాగా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శుక్రవారం ఉదయం 6గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటలదాకా  144 సెక్షన్ విధిస్తున్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.