గ్రామీణ మహిళల ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెటింగ్ : మంత్రి సీతక్క

గ్రామీణ మహిళల ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెటింగ్ : మంత్రి సీతక్క
  • సగటు స్త్రీ అస్తిత్వంగా స్వయం సహాయక సంఘాలు: మంత్రి సీతక్క
  • ఎస్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌జీల భాగస్వామ్యంతో రాష్ట్ర ఆర్థిక రంగానికి ఊతం
  • మండల సమాఖ్య అధ్యక్షుల రాష్ట్ర స్థాయి సదస్సుకు హాజరు 

హైదరాబాద్, వెలుగు: గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తూ.. వారిని గ్లోబల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌ వైపు తీసుకెళ్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. స్వయం సహాయక బృందాల రూపంలో సగటు స్త్రీ అస్తిత్వం శక్తివంతమవుతోందని, ఎస్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌జీల భాగస్వామ్యంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. శనివారం ప్రజా భవన్‌‌‌‌‌‌‌‌లో జరిగిన మండల సమాఖ్య అధ్యక్షుల రాష్ట్రస్థాయి సదస్సుకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 ఈ సందర్భంగా సామాజిక బాధ్యతను బలోపేతం చేసే సంకల్పంతో మహిళా సంఘాల సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చి.. వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. 

మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ప్రభుత్వ సంకల్పంపై కొంతమంది ఎద్దేవా చేశారని, ఇప్పటికే అనేక మండల సమాఖ్యల్లో రూ.కోట్ల నిధులు ఉండటం, గ్రామీణ మహిళలు వ్యాపారాలు నెలకొల్పడం, ఆ లక్ష్యాన్ని సాకారం చేస్తోందని పేర్కొన్నారు. ఏటా బ్యాంకులు రూ.20 వేల కోట్లకు పైగా నిధులను ఎస్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌జీలకు రుణాలుగా ఇవ్వడం, అందులో 99 శాతం తిరిగి చెల్లించడం మహిళల నిబద్ధతకు నిదర్శనమన్నారు. 

ఇప్ప పువ్వు లడ్డూలకు విదేశాల్లోనూ క్రేజ్‌‌‌‌‌‌‌‌.. 

గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ఇందిరా మహిళా శక్తి బజార్‌‌‌‌‌‌‌‌లు విస్తరించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఆదిలాబాద్ ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్న ఇప్ప పువ్వు లడ్డూలు విదేశాల్లో కూడా ప్రాచుర్యం పొందుతున్నాయని తెలిపారు. గ్రామాల్లో, మండలాల్లో మహిళా సమాఖ్యలు ఒంటరి మహిళలకు భరోసాగా నిలుస్తున్నాయని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించేందుకు లబ్ధిదారులకు మహిళా సంఘాలు ఆర్థిక సహకారం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. 

ఇందిరా గాంధీ జయంతి పురస్కరించుకుని ఈ నెల 19న మహిళా శక్తి బలోపేతం కోసం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. అనంతరం డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఓ, అడిషనల్ డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఓలతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలను సమీక్షించి, వాటి బలోపేతంపై సూచనలు చేశారు.