సీపీ సజ్జనార్‌‌‌‌‌‌‌‌ పేరుతో ఫేక్ అకౌంట్

సీపీ సజ్జనార్‌‌‌‌‌‌‌‌ పేరుతో  ఫేక్ అకౌంట్
  • ఆపదలో ఉన్నానని సీపీ ఫ్రెండ్ నుంచి రూ.20 వేలు బదిలీ చేసుకున్న స్కామర్
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచన

బషీర్​బాగ్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌  సిటీ పోలీస్‌‌‌‌‌‌‌‌  కమిషనర్‌‌‌‌‌‌‌‌  సజ్జనార్‌‌‌‌‌‌‌‌  పేరుతో సైబర్  చీటర్లు సోషల్ మీడియాలో ఫేక్  అకౌంట్  క్రియేట్  చేస్తూ అమాయకులను మోసగిస్తున్నారు. ఫేక్  అకౌంట్స్  ద్వారా కమిషనర్‌‌‌‌‌‌‌‌  స్నేహితులు, పరిచయస్తులకు “నేను ఆపదలో ఉన్నాను. డబ్బులు పంపండి” అంటూ మోసపూరిత సందేశాలు పంపుతున్నారు. ఒకరు ఈ సందేశాన్ని నిజమని నమ్మి రూ.20 వేలు పంపించారు. దీనిపై సీపీ సజ్జనార్  స్పందించారు. బాధితుడు చేసిన పేమెంట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఎక్స్ లో ఆయన షేర్  చేశారు. తనకు అఫీషియల్  ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్  పేజీ, ఎక్స్  అకౌంట్ ఉన్నాయని తెలిపారు. ఆ లింక్స్ ను ఆయన షేర్ చేశారు. ఇతర పేర్లతో ఉన్నవన్నీ పూర్తిగా ఫేక్  అని హెచ్చరించారు. ఫేక్‌‌‌‌‌‌‌‌  అకౌంట్లను గుర్తించి తొలగించేందుకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌  సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైం విభాగం మెటా సంస్థతో కలిసి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 

అనుమానాస్పద ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌  రిక్వెస్ట్‌‌‌‌‌‌‌‌లు లేదా డబ్బులు అడిగే సందేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని హెచ్చరించారు. అలాంటి మెసేజ్‌‌‌‌‌‌‌‌లు వస్తే వెంటనే ఆ వ్యక్తితో ఫోన్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడి నిజానిజాలు తెలుసుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. సందేహాస్పద లింకులు, వీడియో కాల్స్‌‌‌‌‌‌‌‌, ఖాతాలను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్  చేయాలని, సైబర్‌‌‌‌‌‌‌‌  మోసాలపై వెంటనే 1930 హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్ లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచించారు.