- ఢిల్లీలో అవార్డు అందుకున్న హైదరాబాద్ అమ్మాయి ఆకర్షణ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీకి చెందిన 14 ఏండ్ల ఆకర్షణ రోటరీ ఇంటర్నేషనల్ యంగ్ అచీవర్ అవార్డు 2025ని కైవసం చేసుకుంది. రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఆర్‌టీఎన్ ఫ్రాన్సిస్కో అరెజ్జో చేతుల మీదుగా ఢిల్లీలో ఈ అవార్డును అందుకుంది. మానవతా సేవ విభాగంలో ఆకర్షణ ఈ పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ అవార్డును అందుకున్న వారిలో అతి చిన్న వయస్కురాలు ఆకర్షణ కావడం విశేషం.
అలాగే, సౌత్ ఇండియా నుంచి ఎంపికైన ఏకైక బాలిక కూడా ఆకర్షణే. ఈ అవార్డుతో పాటు వచ్చిన లక్ష రూపాయల నగదు బహుమతిని పేద పిల్లల కోసం మరిన్ని లైబ్రరీలు నిర్మించేందుకు వెచ్చిస్తానని ఆకర్షణ వెల్లడించింది. ఈ నిధులతో మరో 76 లైబ్రరీలను నిర్మించి, దేశవ్యాప్తంగా100 గ్రంథాలయాలను స్థాపించాలనే తన కలను నెరవేర్చుకుంటానని వివరించింది.
