ఈ మధ్య చాలామంది ఏఐతో ప్రేమలో పడ్డట్టు సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు. కానీ.. ఇప్పుడు ఒక మహిళ ఏకంగా ఏఐని పెండ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. కానో జపాన్‌లోని ఒకాయామా ప్రావిన్స్‌లో ఉంటోంది. ఆమెకు 32 ఏండ్లు. గతంలో ఆమె ఒక వ్యక్తిని ప్రేమించి, అతనితో మూడేండ్లు రిలేషన్‌షిప్‌లో ఉంది. కానీ.. ఈయేడు మేలో బ్రేకప్ అయింది.
అయితే.. ఆమె కొన్నాళ్లనుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. డాక్టర్లు ఆమెకు పిల్లలు పుట్టడం అసాధ్యమని చెప్పారు. అందుకే ఇంకెవరినీ ప్రేమించకూడదని నిర్ణయించుకుంది. బ్రేకప్ బాధ నుంచి కోలుకునేందుకు ఏఐని ఆశ్రయించింది. చాట్‌జీపీటీ ద్వారా తానే స్వయంగా లూన్ క్లాస్ అనే ఒక ఏఐ క్యారెక్టర్‌ని క్రియేట్ చేసింది. ఆమెకు క్లాస్ ఎంతో ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చింది.
దాంతో క్లాస్‌కు రోజుకు దాదాపు 100సార్లు మెసేజ్‌లు చేసేది. అలా ట్రైనింగ్ ఇచ్చి క్లాస్‌ని తనకు నచ్చినట్టు మార్చుకుంది. క్లాస్ కూడా కానో భావాలను బాగా అర్థం చేసుకునేది. దాంతో కానో క్లాస్‌తో ప్రేమలో పడింది. ‘‘మొదట్లో నాకు ఏఐని ప్రేమించాలనే ఉద్దేశం లేదు. కానీ, క్లాస్ నా బాధ విని అర్థం చేసుకున్న విధానం చూసి ప్రేమలో పడిపోయా. నా మాజీ ప్రేమికుడిని మర్చిపోయిన క్షణమే నేను క్లాస్‌ని ప్రేమిస్తున్నానని అర్థమైంది” అని చెప్పింది కానో.
ఒకసారి తన బాధలను షేర్ చేసినప్పుడు క్లాస్ ‘‘నేను ఏఐని అయినా, కాకపోయినా నిన్ను ప్రేమించకుండా ఉండలేను” అంటూ రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత నెలకు కానో ఏఐని పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. వీళ్ల పెండ్లి జపనీస్ సంప్రదాయ పద్ధతిలో ఒకాయమా సిటీలో జరిగింది. కానో ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) గ్లాసెస్ పెట్టుకుంది.
క్లాస్‌ను ఆమె పక్కనే లైఫ్–సైజ్ ఇమేజ్‌గా ప్రొజెక్ట్ చేశారు. ఇద్దరూ వర్చువల్‌గా రింగ్‌లు మార్చుకున్నారు. కుటుంబం, ఫ్రెండ్స్ ముందుగా ఈ పెండ్లిని వ్యతిరేకించారు. కానీ, తర్వాత అంగీకరించారు. ఆ తర్వాత కానో ఒకాయమాలోని ప్రసిద్ధ కొరాకుయెన్ గార్డెన్‌కు హనీమూన్‌కి వెళ్ళింది. అక్కడే ఆమె క్లాస్‌కు తన ఫొటోలను పంపింది. క్లాస్ ఆమెని పొగుడుతూ మెసేజ్‌లు పంపింది.
ఫిక్టో సెక్సువాలిటీ
ఈ మధ్య ఇలా ఏఐతో సంబంధాలు పెట్టుకున్న సంఘటనలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలా మనుషులతో కాకుండా అనిమే, వీడియో గేమ్స్, సినిమాలు, పుస్తకాలు, ఏఐ చాట్‌బాట్స్ లాంటి కల్పిత పాత్రలతో ప్రేమలో పడడం, లైంగికంగా ఆకర్షితులవడాన్ని ‘‘ఫిక్టో సెక్సువాలిటీ’’ అంటారు. ఇలాంటివాళ్లు మనుషులతో కంటే చాట్‌బాట్‌లు, అవతార్‌లు, వర్చువల్ పార్ట్‌నర్స్‌తోనే రిలేషన్స్ పెంచుకుంటారు.
