పచ్చని రాజ్యం.. ప్రపంచంలో అన్నింటికన్నా గొప్పది.. అదెలా వస్తుందంటే..!

పచ్చని రాజ్యం.. ప్రపంచంలో అన్నింటికన్నా గొప్పది..  అదెలా వస్తుందంటే..!

పూర్వకాలంలో విక్రమపురి రాజ్యాన్ని సూర సేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు కాలంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించేవారు. అలా కొద్దికాలం గడిచిన తర్వాత రాజ్యంలో వర్షాలు లేక కరువు వచ్చింది. ప్రజలు తిండిలేక ఇబ్బందులుపడ్డారు. చేసేదిలేక రాజు పొరుగు రాజ్యాల నుంచి  ధాన్యాన్ని దిగుమతి చేసుకున్నాడు. అయినప్పటికీ ప్రజల అవసరాలు తీరలేదు. పైగా అప్పులు పెరిగాయి. 

గతంలో అన్ని పోటీల్లో విజయ పరంపర మోగించిన రాజ్యం చిన్న రాజ్యాలతో కూడా పోటీపడలేక వెనకబడిపోయింది. పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోయాయి. అయినా రాజు పెద్దగా పట్టించుకోలేదు. ఈ పరిస్థితి గమనించిన నందసేనుడు అనే మంత్రి రాజుకు రాబోయే పరిస్థితుల గురించి వివరించాడు. అయినా ఫలితం లేకుండా పోయింది.

 మంత్రి సలహాలను రాజు పెడ చెవిన పెట్టాడు. అయితే రాజుగారికి ఆస్థాన సభలో ప్రశ్నల పరంపర కురిపించడం అలవాటుగా ఉండేది. అయితే, ఒకనాడు సూరసేనుడు మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేశాడు. ‘‘నాకు ప్రశ్నలు అడగడం అంటే చాలా సరదా అని మీ అందరికి తెలుసు కదా! ఈరోజు కూడా ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నా. మీరంతా నా ప్రశ్నకు ఏం జవాబు చెబుతారో అని ఆసక్తిగా ఉంది’’ అన్నాడు.

మహారాజు సూరసేనుడు లేచి ‘మేధావులైన మంత్రులారా! ఈ ప్రపంచంలో అన్నింటికన్నా గొప్పది ఏది?’ అని ప్రశ్నించాడు.ఒక మంత్రి నిలబడి ‘మహారాజా.. ఈ లోకంలో అన్నింటి కంటే గొప్పది బంగారం’  అన్నాడు. మరొకరు లేచి ‘డబ్బు’ అన్నారు. మరో మంత్రి  లేచి  ‘సంతానం’ అన్నారు. ఇంకొకరు లేచి ‘రాజ్య విస్తరణ’ అన్నారు. మరొకరు లేచి ‘పాండిత్యము’ అన్నారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు సమాధానాలు చెప్పారు.

కానీ.. నందసేనుడు మౌనంగా ఉన్నాడు. అతని వైపు చూసి.. ‘‘ఏమి నందసేన? నా ప్రశ్నకు నీ సమాధానం ఏమిటి?’’ అని ప్రశ్నించాడు రాజు. ‘‘మహారాజా! ఈ ప్రపంచంలో అన్నింటికన్నా గొప్పది ‘ఆరోగ్యం’. అందుకు కావలసింది పరిశుభ్రత పాటించడం. ప్రకృతిని కాపాడుకోవడం వల్ల అది సాధ్యమవుతుంద’’ని నందసేనుడు జవాబిచ్చాడు. అయితే అది ఎట్లా సాధ్యమో చెప్పమన్నాడు రాజు. 

అప్పుడు నంద సేనుడు లేచి.. ‘‘మహారాజా! ఆరోగ్యం బాగుంటేనే కదా ఏదైనా సాధించేది. ఆరోగ్యం బాగా లేకుంటే ఎంత ధనం, ఆస్తిపాస్తులు ఉన్నా, ఎంత కీర్తి ప్రతిష్టలు ఉన్నా ఏం లాభం? మనం వాటన్నింటినీ అనుభవించాలంటే ఆరోగ్యం ముఖ్యం కదా!’’ అన్నాడు.

రాజు ‘‘అందుకు మనం ఏం చేయాలో అది కూడా చెప్పమ’’ని కోరాడు. అప్పుడు నంద సేనుడు.. ‘‘రాజా! రాజ్యంలో ఉన్న కరువు కాటకాలు తొలగించాలంటే, ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే  చెట్లను బాగా నాటాలి. అడవుల విస్తీర్ణం తగ్గిపోతుండడం వల్ల వర్షాలు లేక పంటలు పండడం లేదు. ప్రజలు ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. 

ప్రకృతి పచ్చగా ఉంటే వర్షాలు సమృద్ధిగా పడతాయి. పంటలు బాగా పండుతాయి. స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. అప్పుడే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకుగాను ప్రతి ఒక్కరూ పది చెట్ల చొప్పున నాటాలి. వాటిని కాపాడాలి. ఇదంతా తెలియాలంటే ప్రజలు విద్యావంతులు కావాలి” అని రుద్రసేనుడు విడమర్చి చెప్పాడు. మరుసటి రోజు నుంచే రాజు మంత్రి సూచనలు అమలు చేయడం ప్రారంభించాడు. రాజ్యంలో పంటలు పుష్కలంగా పండి ప్రజల బాధలు తీరాయి. పూర్వ వైభవం వచ్చినందుకు  రాజు సంతోషించాడు.

- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి-