మనిషి జీవితం ఎంత కాలం? అప్పుడెప్పుడో తాతల నాటి తరంలో నూరేండ్లు బతికేవాళ్లని చెప్తుంటారు. రోజులు గడిచేకొద్దీ దీర్ఘాయువు అనేది డెబ్భై, ఎనభైకి చేరింది. ఈ మధ్య వచ్చిన కొన్ని స్టడీల్లో జీవిత కాలం పెరుగుతోంది అని తేలింది. కానీ, మరోవైపు చూస్తే.. బడి వయసు పిల్లల నుంచి పెండ్లీడుకొచ్చిన వాళ్ల వరకు ఉన్నట్టుండి ఉపద్రవం ముంచుకొచ్చినట్టు ఎక్కడివాళ్లు అక్కడే ప్రాణాలు వదిలేస్తున్నారు.
కారణం తెలియకుండా, చిన్న అనుమానం రాకుండా క్షణాల్లోనే మనిషి నిర్జీవంగా మారుతున్నాడు. ఎందుకిలా జరుగుతోంది? అంటే.. సడెన్ హార్ట్ ఎటాక్ల వల్లే అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఆ వయసులో హార్ట్ ప్రాబ్లమ్స్ ఏంటని ఆరా తీస్తే.. దానికి కారణం లైఫ్ స్టయిల్ అని తేలింది. ఇదే కాదు.. ఏ అనారోగ్య సమస్యా దరిచేరకుండా నిండు నూరేండ్లు హాయిగా బతకాలంటే బ్లూ జోన్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి అంటున్నారు. ఏంటా లైఫ్ స్టైల్? ఎవరు కనిపెట్టారు?
ప్రపంచంలోని ఓ ఐదు ప్రాంతాల్లోని ప్రజల జీవిన విధానమే బ్లూ జోన్ లైఫ్ స్టైల్. జపాన్‌లోని ఒకినావా, ఇటలీలోని సార్డీనియా, కోస్టారికాలోని నికోయా, గ్రీస్‌లోని ఇకారియా, కాలిఫోర్నియాలోని లోమా లిండా సిటీల్లో ప్రజలు చాలా హెల్దీగా ఉంటారు. చాలావరకు వందేండ్లు బతుకుతున్నారు. వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. పెద్దగా రావు అని చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.
ఇటీవల ఢిల్లీలో ‘బ్లూ జోన్స్ సీక్రెట్స్ : హెల్దీ హార్ట్, మైండ్ అండ్ సోల్ ఫర్ వైబ్రంట్ లాంగెవిటీ’ అనే అంశం మీద కాన్ఫరెన్స్ జరిగింది. అందులో బ్లూ జోన్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే నిశ్చింతగా బతకొచ్చని ఎక్స్పర్ట్స్ స్పష్టం చేశారు. అయితే ఇది ఇప్పుడు కొత్తగా చెప్తోన్న కాన్సెప్ట్ కాదు.. గతంలోనే ఓ స్టడీలో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా తేల్చిన వాస్తవం.
పవర్ 9
బ్లూ జోన్ లైఫ్ స్టైల్ అంటే.. ఇదొక థియరీ. ఇందులో మన రోజూవారీ అలవాట్లకు సంబంధించి తొమ్మిది కీలక అంశాలు ఉంటాయి. ఈ తొమ్మిది అలవాట్లు పాటిస్తే నూరేళ్ల జీవితం మీ సొంతం. అవేంటో వివరంగా తెలుసుకుందాం.
సహజంగా కదలండి :
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించే వాళ్లు కండలు తిరిగిన దేహంతో ఉండుంటారు. ఫిజిక్ లేదా ఫిట్నెస్ మెయింటెయిన్ చేస్తారు. మారథాన్ పోటీల్లో పాల్గొంటారు. ఎక్కువ సమయం జిమ్‌లలో గడుపుతారు అనుకుంటున్నారా.. అస్సలు కాదు. వాళ్లు ఇలాంటివేవీ చేయరు. కానీ... వీటికి బదులు వాళ్లు ఆలోచించకుండానే నిత్యం కదులుతూ ఉంటారు. అంటే.. షాప్‌కి వెళ్లడం, స్నేహితుడి ఇంటికి లేదా టెంపుల్స్‌కు నడిచే వెళ్తారు. ఇంట్లో మెట్లు ఎక్కడం, దిగడం వాళ్లకు మామూలే. పైగా ఇంటి ముందో, వెనకో ఎక్కడో ఒకచోట మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. రోజువారీ పనుల్లో భాగంగా వాటి బాగోగులు చూసుకుంటారు. ఇలాంటి అలవాట్లు ఉండడం వల్ల వాళ్ల శరీరం ఆటోమెటిక్‌గా కదులుతూ ఉంటుంది. అలా కుదరదు అనుకునేవాళ్లు ఇలా చేయండి. ఎస్కలేటర్, లిఫ్ట్‌కు బదులు మెట్లు వాడండి. పెట్ పెంచుకునేవాళ్లైతే వాటితో కలిసి కాసేపు నడవండి. ఇంటి ఆవరణలోనే చిన్న చిన్న పనులు చేయండి. సమయాన్ని ఆదా చేసే ఎలక్ట్రానిక్ వంటి గాడ్జెట్లు వాడడం తగ్గించండి.
మీ ఉద్దేశాన్ని తెలుసుకోండి :
ఒకినావ ప్రజలు దీన్ని “ఇకిగై” అని పిలుస్తారు. జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకున్నవాళ్లు మిగతావాళ్ల కంటే ఎక్కువ కాలం జీవిస్తారని స్టడీలు చెప్తున్నాయి. మీ లైఫ్ పర్పస్ గురించి రీసెర్చ్ చేయాలనుకుంటే ముందు జీవితంలో మీరు ఏదైనా చేయగలరా? ఆలోచించండి. మీలో ఉన్న ప్రతి టాలెంట్‌ను బయటపెట్టండి. మీ మనసులో ఉన్న ఉద్దేశాలు, భావోద్వేగాలను బలంగా చెప్పడానికి ప్రయత్నించండి. మీరేం చేయాలనుకుంటున్నారో? ఏది వద్దు అనుకుంటున్నారో అనే దానిపై స్పష్టంగా ఉండండి. మీరు నేర్చుకున్న స్కిల్స్ మీ జీవితానికి అర్థం చెప్పే విధంగా పనిచేయండి.
డౌన్ షిఫ్ట్ :
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఒత్తిడి.. కామన్ అయిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువకాలం జీవించే వాళ్లు ఒత్తిడిని తొలగించుకునే పనిలో ఉంటారు. ఒకినావ ప్రజలు ప్రతిరోజూ తమ పూర్వీకులను గుర్తుచేసుకుంటారు. దేవుడికి ప్రార్థన చేస్తారు. ఇకారియన్లు మధ్యాహ్నం పూట కునుకు తీస్తారు. సార్డినియన్లు హ్యాపీ అవర్ పాటిస్తారు. అంటే ఒక గంటపాటు ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సొసైటీతో కలిసి సరదాగా తినడం, తాగడం, ఆడుకోవడం వంటివి చేసి ఒత్తిడి తగ్గించుకుంటారు. ఒత్తిడి తగ్గితే శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్ అవుతారు.
80 శాతం రూల్ :
ఒకినావ ప్రజలు భోజనానికి ముందు “హారా హచి బు” అనే 2500 సంవత్సరాల నాటి కన్ఫ్యూషియన్ మంత్రాన్ని తలుచుకుంటారు. ఆ మంత్రానికి అర్థం ఏంటంటే ‘కడుపు 80 శాతం నిండిన తర్వాత ఆపండి’ అని. తినేటప్పుడు టీవీ, ఫోన్ చూడొద్దు. అంతేకాదు.. బ్లూ జోన్స్ ప్రాంతాల్లోని వాళ్లు మధ్యాహ్నం ఆలస్యంగా లేదా సాయంత్రం ప్రారంభంలో వారు కొంచెం తింటారు. ఆ తర్వాత అస్సలు ఏవీ తినరు.
5మొక్కల నుంచి వచ్చే ఫుడ్ :
బ్లూ జోన్స్ ప్రాంతాల్లోని వాళ్లు తాజా పండ్లు, కూరగాయలు బాగా తింటారు. వాళ్లలో కొద్ది మంది, చాలా అరుదుగా, తక్కువ మొత్తంలో మాంసం తింటారు. నూరేండ్లు బతికిన వాళ్లు ఎక్కువగా ఏం తినేవాళ్లంటే.. బీన్స్, సోయా, లెంటిల్స్ వంటివి. అలాగని మిమ్మల్ని మాంసం తినొద్దని కాదు.. తినండి. కానీ వారానికి రెండు సార్లు మాత్రమే తింటే మంచింది. రోజుకు ఒక గుప్పెడు నట్స్ తినడం వల్ల మీ ఆయుష్షు 2-3 సంవత్సరాలు పెరుగుతుంది. రుచి గురించి కాకుండా హెల్దీగా, ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉంచే ఫుడ్‌ను ఎంచుకుంటే బెటర్.
సాయంకాలం
స్నేహితులు :
రోజుకు ఒకసారి స్నేహితులతో టైం స్పెండ్ చేయడం వల్ల సంతోషంగా ఉంటారు. టీ, కాఫీ లేదా శ్నాక్స్ వంటివి తింటూ కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోండి. ఫ్యామిలీతో గడిపితే అండర్స్టాండింగ్ పెరుగుతుంది. బంధాలు బలపడతాయి. పనులు టైంకి పూర్తవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. సొసైటీతో కలిసి మెలగడం అలవాటు అవుతుంది. అందుకని ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు విరామం తీసుకోండి.
పాజిటివ్ ప్యాక్ :
హెల్దీ ఎన్విరాన్మెంట్లో ఉండండి. లేదా మీరే క్రియేట్ చేయండి. ఇకారియన్లు తరచుగా గ్రూప్‌లు ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఒకినావన్లలో ఐదుగురి ఫ్రెండ్స్ కలిసి “మోయాయి” గ్రూపుగా ఏర్పడతారు. వాళ్లు జీవితాంతం ఒకరితో ఒకరు కట్టుబడి ఉంటారు. సరైన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండడం మీ లైఫ్‌కి ఎన్నో సంవత్సరాలను జోడిస్తుంది. కాబట్టి ఆరోగ్యాన్ని పాడుచేసే అలవాట్లు ఉన్నవాళ్లతో కాకుండా హెల్దీ పీపుల్‌తో కలిసి ఉండండి.
విశ్వాస ఆధారిత సమాజం :
బ్లూ జోన్స్ ప్రాంతాలపై స్టడీలో భాగంగా 263 మందిని ఇంటర్వ్యూ చేశారు. శతాయుష్మానుల్లో ఐదుగురు తప్ప అందరూ ఏదో ఒక విశ్వాసాన్ని బలంగా నమ్మే సమాజానికి చెందినవాళ్లే. వాళ్లకు నచ్చిన భావాలను, ఉద్దేశాలను ఫాలో అవుతారు. తమ వారి పట్ల విశ్వాసం కలిగి ఉంటారు. బలమైన సామాజిక సంబంధాలు మీ జీవితానికి అధిక సంవత్సరాలు జోడిస్తాయి.
ప్రియమైనవాళ్లకు ప్రియారిటీ :
బ్లూ జోన్స్ ప్రాంతాల్లో ఉన్న శతాయుష్మానులు వాళ్లు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడానికి తమ కుటుంబాలే కారణం అని చెప్పారు. అలాగే వాళ్లు కూడా మొదటి నుంచి తమ వాళ్లకు అలాంటి ప్రాధాన్యతే ఇచ్చినట్లు చెప్పారు. ఇలా మీ ప్రియమైన వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆయుష్షు ఆరు సంవత్సరాలు పెరుగుతుంది. ఆయుష్షు పెరగడమే కాదు.. మీరు ముసలి వాళ్లు అయినప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని అలాగే చూసుకుంటారు. మీ కంటే పెద్దవాళ్లను మీరు చూసుకునే విధానాలు వాళ్లు చూసి నేర్చుకుంటారు. ఇది పిల్లలకు నేర్పాల్సిన ఉత్తమమైన,
ముఖ్యమైన విషయం.
దీర్ఘాయువు మీద స్టడీ
బ్లూ జోన్ థియరీని డాన్ బ్యుట్నర్ పరిచయం చేశాడు. ఈయన అమెరికన్ రైటర్, నేషనల్ జియోగ్రఫీకల్ ఎక్స్‌ప్లోరర్. 2000 సంవత్సరంలో జపాన్‌లో ఒకినావా వెళ్లినప్పుడు దీర్ఘాయువు మీద ఇన్వెస్టిగేట్ చేశాడు. అక్కడ దొరికిన సమాచారంతో ఎక్కువకాలం బతికే ప్రజలు ఉండే చోటును కనుగొనాలనే తపన డాన్ మనసులో మొదలైంది.
దాంతో తన టీంని వెంటపెట్టుకుని 2004లో ‘దీర్ఘాయువు’ గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. వాళ్లు సేకరించిన డెమోగ్రఫిక్ డేటా పరిశీలించాడు. నూరేండ్లు దాటిన వాళ్లను ఇంటర్వ్యూ చేశాడు. ఆ తర్వాత నూరేండ్లు, అంతకంటే ఎక్కువ కాలం బతికినవాళ్లంతా కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నారని గుర్తించాడు. ప్రపంచమంతా చూసిన ఆయనకు కేవలం ఐదంటే ఐదు మాత్రమే బ్లూ జోన్స్ కనిపించాయి.
అవి కూడా దేశాలు.. చిన్న గ్రామాలు అని తెలిసి ఆశ్చర్యపోయాడు. ఆ గ్రామాల్లో ప్రజలు ఎక్కువకాలం జీవించడానికి గల కారణాలు ఏంటి? అని తెలుసుకున్నారు. వాటిలో లైఫ్ స్టయిల్‌కి సంబంధించిన తొమ్మిది అంశాల గురించి చెప్పారు. ఆ అలవాట్లను వాళ్లు ‘పవర్ 9’ అని పిలుస్తున్నారు. ఆ తర్వాత బ్లూ జోన్స్ అనే లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ కూడా స్థాపించాడు.
డాన్ తన రీసెర్చ్‌లో భాగంగా చేసిన అడ్వెంచర్స్, తాను నేర్చుకున్న విషయాల గురించి ‘ది బ్లూ జోన్స్’ అనే పుస్తకంలో రాశాడు. అది న్యూయార్క్ టైమ్స్‌లో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది.
