సర్కార్‌‌ ఉక్కిరిబిక్కిరి

సర్కార్‌‌ ఉక్కిరిబిక్కిరి
  • సమ్మెపై విచారణ జరిగిన ప్రతిసారీ మొట్టికాయలే
  • కోర్టు ఆదేశాలతో కొన్నిసార్లు దిగిరాక తప్పని పరిస్థితి
  • జడ్జిల ఆగ్రహంతో ఉన్నతాధికారుల అభాసుపాలు
  • కార్మికులకు భరోసానిస్తున్న న్యాయస్థానం వ్యాఖ్యలు

‘‘అగ్గి మొదలైంది. అగ్గి రాజుకుని మంటలు ఎగిసిపడే వరకూ చేయకండి. ఇతర సంఘాలు కూడా స్వరం కలిపితే పరిస్థితి ఏంది..? ప్రజాస్వామ్యంలో ప్రజాగళం విప్పితే ఎవరూ అడ్డుకోలేరు. ఫిలిప్పీన్స్‌‌లో పాలకుడికి ఎంతో ఆదరణ ఉండేది. కానీ ప్రజలు ఎదురు తిరిగేసరికి ఏం జరిగింది. అక్కడ పాలనకు తెర పడింది. ఎంత ప్రజా బలం ఉన్న నేత అయినా ప్రజల అంశాల దగ్గరికి వచ్చే సరికి ఎంత హంబుల్‌‌గా ఉంటే అంత మంచిది’’ఇదీ అక్టోబర్ 18న రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసిన తీరు. ఇలా ఒకట్రెండు సార్లు కాదు.. ఆర్టీసీ సమ్మె విషయంలో కోర్టు విచారణ జరిగిన ప్రతిసారీ రాష్ట్ర ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి. హైకోర్టు జడ్జీలు ప్రతి సందర్భంలోనూ సర్కార్​తీరును తప్పుపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. సమ్మెకు కోర్టు నుంచి అనుకూల వ్యాఖ్యలు రావడం కార్మికుల్లో ధీమా పెంచింది.

ప్రభుత్వానికి తిప్పలు

అక్టోబర్‌‌ 5న ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైంది. అప్పటి నుంచి సమ్మెపై హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతూనే ఉన్నాయి. సెప్టెంబర్‌‌ నెల జీతం ఆగిపోవడం, ఆర్టీసీ ప్రైవేట్‌‌ పరం చేయడంపైనా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై వాదనలు, విచారణ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో సర్కార్‌‌, అధికారుల తీరుపై జడ్జీలు తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ఆర్టీసీపై తప్పుడు లెక్కలేంది. ఏం తమాషానా? నిప్పు రాజేసి చలికాచుకునే ప్రయత్నం వద్దు. ఇది బ్రిటీష్‌‌ జమానా కాదు. కోర్టులతో ఆటలాడొద్దు’లాంటి కఠిన పదాలను ఉపయోగించి ఫైర్‌‌ అయ్యారు. ఒకనొక సమయంలో ‘‘కోర్టులు కొడతయా అండి’’అని సీఎం అసహనం వ్యక్తం చేశారు.

కోర్టు ఆదేశాలతో దిగొచ్చి

హైకోర్టు సర్కార్‌‌కు చురకంటిస్తూనే పలు ఆదేశాలు జారీ చేసింది. వాటిని అమలు చేయాల్సిందేనని ఆర్డర్‌‌ ఇచ్చింది. కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని సూచించింది. కోర్టు ఆర్డర్‌‌ కాపీ రాలేదని సర్కార్‌‌ ఆలస్యం చేసినా.. చివరికి నామమాత్రంగా చర్చలు జరిపింది. కానీ ఫలితం తేలలేదు. ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన సకల జన భేరీ సభకు సర్కార్‌‌ అనుమతి ఇవ్వలేదు. దీంతో కోర్టుకెళ్లి పర్మిషన్‌‌ తెచ్చుకున్నారు.

తలలు పట్టుకుంటున్న అధికారులు

ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వ అధికారులు, ఆర్టీసీ ఆఫీసర్లు కోర్టులో అబాసుపాలు అవుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, ఆర్టీసీ ఉన్నతాధికారులు స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ఉన్నతాధికారులు తలోమాట చెబుతున్నారని, కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని అనేక సందర్భాల్లో జడ్జీలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో లీగల్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌, ఉన్నతాధికారులు తల పట్టుకుంటున్నారు. సర్కార్‌‌ తీరుతో సదరు అధికారులు లోపల ఎంతో బాధ, కోపంతో ఉన్నా బయటికి చెప్పుకోలేపోతున్నట్లు తెలుస్తోంది.

కార్మికుల్లో పెరిగిన ధీమా

ఆర్టీసీ చరిత్రలో ఇంత పెద్ద సమ్మె జరగడం ఇదే తొలిసారి. మొత్తం 48 వేల మందికిపైగా కార్మికులు.. సీఎం ఎన్ని డెడ్‌‌లైన్లు పెట్టినా, వార్నింగ్​లు ఇచ్చినా పట్టించుకోలేదు. మొదట్లో కార్మికులు భయాందోళనకు గురైనా.. కోర్టు ఆదేశాలు, వ్యాఖ్యలతో వారికి ధైర్యం ఇచ్చినట్లయింది. ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను కోర్టు కడిగిపారేసిన తీరు కార్మికుల్లో ధీమా పెరిగింది. కోర్టు తీర్పు తమకు అనుకూలంగానే వస్తుందని వారు ఆశాభావంతో ఉన్నారు.

కోర్టు అసహనం ఇలా..

అక్టోబర్‌‌ 15: ‘‘మెట్టు దిగి మాట్లాడుకోండి.. నిప్పు రాజేసి చలికాచుకునే ప్రయత్నం వద్దు. ఇది బ్రిటిష్‌‌ జమానా కాదు. చర్యలపై రెండు రోజుల్లో రిపోర్టు ఇయ్యండి. ముందు రెగ్యులర్‌‌ ఎండీని నియమించండి’’అని కోర్టు ఫైర్​ అయ్యింది.

అక్టోబర్‌‌ 28: ‘‘మేము కూడా ఆర్టీసీ బస్సుల్లో తిరిగినవాళ్లమే. బస్సులు లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటయో మాకూ తెలుసు. 40 శాతం కంటే మించి బస్సులు నడుస్తలేవు. మారుమూలన ఉన్న ఆదిలాబాద్‌‌ జిల్లాలో రోగంతో బాధపడే పిల్లాడ్ని వరంగల్‌‌ ఆస్పత్రికి తీసుకుపోవాలంటే మార్గం ఏది? పాలమూరు నుంచి ఓ డెంగీ రోగి హైదరాబాద్‌‌ ఎలా వస్తడు. సొంతంగా అంబులెన్స్‌‌ల్లో రాలేరుగా.. సామాన్యుల బాధలను మానవీయం కోణంలో చూడాలి’’అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

అక్టోబర్‌‌ 29 : ‘‘సర్కార్‌‌ లెక్కలన్నీ అంకెలగారడీలా ఉన్నాయి. హుజూర్‌‌నగర్‌‌కు వంద కోట్లు ఇచ్చారు. ఆర్టీసీకి ఇవ్వలేరా? అప్పునకు గ్యారెంటీ ఇచ్చినంత మాత్రాన డబ్బులు ఇచ్చినట్టేనా? సరైన వివరాలతో రండి’’అని ఆర్టీసీ ఇన్​చార్జ్​ ఎండీ సునీల్‌‌ శర్మను కోర్టు ఆదేశించింది.

నవంబర్‌‌ 1: ‘‘ఆర్టీసీపై తప్పుడు లెక్కలేంది. ఏం తమాషానా? బకాయిలపై మంత్రికి ఒక లెక్క.. మాకో లెక్క చెప్తరా? కోర్టులతో ఆటలాడొద్దు. పర్యవసానాలు ప్రభుత్వానికి తెలియవా? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు?’’అని కోర్టు మండిపడింది.

నవంబర్‌‌ 7: ‘‘ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తది. సారీలు, ప్లీజులు కోరడం కాదు. వాస్తవాలు చెప్పాలి. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి లెక్కలు, పదాలు వాడారు. మంత్రికి తప్పుడు లెక్కలు ఇస్తే ప్రభుత్వాన్ని చీట్ చేసినట్లే. కేబినెట్‌‌, సీఎంకు తప్పుడు లెక్కలు ఇచ్చారు. తప్పుదోవ పట్టించిన ఆర్టీసీ ఎండీని మంత్రి ఎందుకు కొనసాగిసస్తున్నారో అర్థం కావడం లేదు. మీ సమాచారంతో మంత్రి సీఎంను, కేబినెట్‌‌ను, ప్రజలను మోసం చేయాలని అనుకుంటున్నారా?’’అని కోర్టు నిలదీసింది.