
- అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస
- నేడు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు
- సంతాపం ప్రకటించిన జడ్జిలు, అడ్వకేట్లు
- 2022, మార్చిలో తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, వెలుగు: హైకోర్టు జడ్జి జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని (61) ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్ హఫీజ్ పేటలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అంత్యక్రియలు సోమవారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జస్టిస్ ప్రియదర్శినికి భర్త డాక్టర్ కే.విజయ్ కుమార్, ఇద్దరు కొడుకులు నిఖిల్, అఖిల్ ఉన్నారు. జస్టిస్ ప్రియదర్శిని మృతిపట్ల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, ఇతర న్యాయమూర్తులు, అడ్వకేట్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
1995లో అడ్వకేట్‌గా తన వృత్తిని ప్రారంభించిన జస్టిస్ ప్రియదర్శిని.. విశాఖపట్నంలో సివిల్, క్రిమినల్, లేబర్ లా, వైవాహిక వివాదాలకు సంబంధించిన కేసులు వాదించారు. 2008, నవంబర్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా జిల్లా జడ్జిగా ఎంపిక అయి డిస్ట్రిక్ట్ అడిషనల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. ఖమ్మం ఫ్యామిలీ కోర్టులో మూడేండ్లు, విజయనగరం మొదటి అదనపు జడ్జిగా, నంద్యాలలో అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు. 2017లో ఒంగోలు జిల్లా కోర్టు చీఫ్‌గా పదోన్నతి పొందారు. ఆదిలాబాద్ జిల్లా కోర్టు చీఫ్ జడ్జిగా పని చేసిన ఆమె.. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా కోర్టు చీఫ్ జడ్జిగా, రాష్ట్ర లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీగా ఉన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో అదనపు జిల్లా జడ్జిగా సేవలందించారు. అనంతరం పదోన్నతి పొంది.. 2022, మార్చి 24న తెలంగాణ హైకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీనియార్టీ ప్రకారం ఆమె 16వ స్థానంలో ఉన్నారు. వచ్చే ఏడాది ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉంది. విశాఖపట్నం ఎన్‌బీఎం లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆమె, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లాలో ఎల్ఎల్‌ఎం పూర్తి చేశారు. అంతకుముందు సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీలు కూడా పొందారు. ఆమె తండ్రి మాతురి అప్పారావు వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా పనిచేశారు.