హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో సీఎస్‌ఈ(కంప్యూటర్ సైన్స్)లో సీట్ల పెంపునకు అనుమతించాలన్న ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో విద్యాశాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించినా అమలు చేయకపోవడాన్ని కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించరాదో వివరణ ఇవ్వాలంటూ పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏఐసీటీఈ, జేఎన్‌టీయూలు ఆమోదించిన ప్రకారం కంప్యూర్ సైన్స్ తదితర కోర్సుల్లో సీట్ల పెంపునకు అనుమతించాలని, వాటి భర్తీకి మాప్-అప్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సెప్టెంబర్ 9న ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై పలు కాలేజీలు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావుల బెంచ్ విచారణ చేపట్టి ప్రతివాదులకు నోటీసులిస్తూ విచారణను వాయిదా వేసింది.