ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అజిత్ పవార్ స్థానంలో ఎన్సీపీ పగ్గాలను ఎవరు చేపడతారనే అంశం మహా పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఎన్సీపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మరాఠా పొలిటికల్ సర్కిల్స్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ హఠాన్మరణంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన బారామతి నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
ప్రస్తుతం రాజ్య సభ సభ్యురాలిగా ఉన్న అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్‌ను బారామతి ఉప ఎన్నికలో బరిలోకి దించాలని ఎన్సీపీ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే, అజిత్ పవార్ స్థానంలో సునేత్రా పవార్‌ను ఉప ముఖ్యమంత్రిగా ప్రతిపాదించాలని ఎన్సీపీ నిర్ణయించిందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ఎన్‌సీపీ సీనియర్ నాయకుడు, మంత్రి నరహరి జిర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌ను రాష్ట్ర కేబినెట్లోకి తీసుకోవాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.
►ALSO READ | విఠల్ మణియార్.. పవార్ ఫ్యామిలీకి ఆత్మ.. తెర వెనక నడిపేది అంతా ఇతనే..!
బారామతి ఉప ఎన్నికలో పోటీ అంశంపై సునేత్రా పవార్‌తో ఇప్పటికే ఎన్సీపీ సీనియర్ నాయకులు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, ధనంజయ్ ముండే, సునీల్ తత్కరేలు అంతర్గంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా అజిత్ స్థానంలో సునేత్రా పవార్ పేరును డిప్యూటీ సీఎంగా ప్రతిపాదించాలని.. ఈ అంశంపై చర్చించేందుకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలవాలని ఎన్సీపీ నాయకత్వం డిసైడైనట్లు టాక్.
ఇక, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ ఎన్సీపీకి నాయకత్వం వహించవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. బారామతి బై పోల్, డిప్యూటీ సీఎం ప్రతిపాదన అనంతరం శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో విలీన అంశంపై చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తోన్న చార్టర్డ్ ఫ్లైట్ బుధవారం (జనవరి 28) బారామతి విమానాశ్రయంలో క్రాష్ లాండ్ అయ్యింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆయన మరణించారు. అజిత్ పవార్ హఠాన్మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం నింపింది.
