ఫీజులు గుంజుతున్న స్కూళ్లపై చర్యలు తీస్కున్నరా?

ఫీజులు గుంజుతున్న స్కూళ్లపై చర్యలు తీస్కున్నరా?
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న 
     

హైదరాబాద్, వెలుగు: కరోనా విపత్తు సమయంలో స్టూడెంట్ల నుంచి స్కూళ్లు ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలన్న జీవోను సక్రమంగా అమలు చేస్తున్నరా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎక్కువ ఫీజులు గుంజుతున్న స్కూళ్లపై ఏం చర్యలు తీసుకున్నరు? ఎన్ని స్కూళ్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు? ఎన్ని బడుల గుర్తింపును రద్దు చేశారు? పూర్తి వివరాలను అందజేయాలని ఆదేశించింది. ఎన్ని స్కూళ్లపై విచారణలు కొనసాగుతున్నాయో జిల్లాలవారీగా వివరాలు ఇవ్వాలంటూ ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ స్కూళ్లు ఆన్ లైన్ క్లాసుల పేరిట భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ దాఖలైన పిల్స్ ను బుధవారం హైకోర్టు మరోసారి విచారించింది. కరోనాతో పేరెంట్స్ ఇబ్బందులు పడుతుంటే స్కూళ్లు ట్యూషన్ ఫీజుతో పాటు ఇతర ఫీజులనూ వసూలు చేశాయని లాయర్ రచనా రెడ్డి వాదించారు. ప్రభుత్వ అడ్వకేట్ సంజీవ్ కుమార్ వాదిస్తూ.. జీవో అమలుకు జాయింట్ డైరెక్టర్లతో కమిటీ ఏర్పాటైందని, జీవోను ఉల్లంఘించిన స్కూళ్లపై జిల్లా స్థాయిలో ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఇలాంటి మరో పిల్ విచారణ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కౌంటర్ వేశామన్నారు. తదుపరి విచారణను ఏప్రిల్ 23కు బెంచ్ వాయిదా వేసింది.