
హైదరాబాద్, వెలుగు: కొలాంగోందిగూడ గిరిజనులను అడవి నుంచి తరలించి, టింబర్ డిపోలో ఉంచడంపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. వాళ్లూ మనుషులేనని, జంతువుల్లా ఫారెస్ట్ రేంజి డిపోలో ఉంచడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివాసీలకు కూడా హక్కులుంటాయని, అడవిని ఆక్రమించుకున్నారని చెప్పి చెప్పాపెట్టకుండా తరలించడం సరికాదని స్పష్టం చేసింది. పునరావాస చర్యలు తీసుకున్నాకే వాళ్లను అడవి నుంచి తరలించి ఉండాల్సిందని పేర్కొంది. ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ఆ 67 మందికి 91 ఎకరాల భూమిని ఆరు నెలల్లోగా ఇవ్వాలని, ఏడాదిలోగా పక్కా ఇండ్లను నిర్మించి ఇవ్వాలని, వారి జీవనోపాధి కోసం పశువులను అందజేయాలని ఆదేశించింది. ఇవన్నీ చేసే వరకు వారికి వాంకిడిలోని ప్రభుత్వ హాస్టల్‌లో వసతి కల్పించాలని సూచించింది. ఇప్పటివరకు ఉన్న అటవీ ప్రాంతంలోనే నివసించేందుకు అనుమతించాలన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.
అత్యవసర విచారణగా..
అధికారులు అడవిని ఖాళీ చేయించే పేరుతో గిరిజనులను బలవంతంగా బయటకు పంపేస్తున్నారని, కుమ్రం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం కొలాంగోందిగూడలో 67 మంది గిరిజనులను టింబర్ డిపోలో నిర్బంధించారని రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ శనివారం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన బెంచ్.. గిరిజన కుటుంబాల పెద్దలను తమ ముందు హాజరుపర్చాలని ఆదేశించింది. దీంతో అధికారులు 16 మందిని ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌కు తీసుకువచ్చి, ఆదివారం సాయంత్రం బెంచ్ ముందు హాజరుపర్చారు. ఫారెస్ట్ అధికారులు తమపట్ల వ్యవహరించిన తీరును గిరిజనులు సిడెం పువా, ఆత్రం భీము తదితరులు కోర్టుకు వివరించారు. తాము దేవుడికి పూజ చేసేందుకు వెళ్లిన సమయంలో అధికారులు వచ్చి ఇండ్లు, పశువుల పాకల్ని కూల్చేశారని చెప్పారు. తమను కొట్టారని, 67 మందిని బలవంతంగా ఫారెస్ట్ డిపోకు తీసుకెళ్లి నిర్బంధించారని తెలిపారు.
అధికారులది హక్కుల ఉల్లంఘన
గిరిజనులు, పిటిషనర్ తరఫున లాయర్ రఘునాథ్ వాదనలు వినిపించారు. ‘‘అధికారులు గిరిజనుల ఇండ్లను, పశువుల కొట్టాలను కూల్చేశారు. భూమిని సాగు చేసుకోనీయకుండా జీవనాధారాన్ని దెబ్బతీశారు. పశువుల కంటే హీనంగా చూశారు. మహారాష్ట్ర నుంచి వలస వచ్చారంటూ.. తిరిగి వెళ్లిపోవాలని వేధించారు. మానవ హక్కులను కాలరాశారు. ఈ నెల 12వ తేదీ నుంచి వేంపల్లి ఫారెస్ట్ టింబర్ డిపోలో నిర్బంధించి ఉంచారు..’’అని వివరించారు. దీనిపై ప్రభుత్వం తరఫున లాయర్ మనోజ్ ప్రతివాదనలు చేశారు. అదంతా రిజర్వుడ్ ఫారెస్ట్ భూమి అని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి గుడిసెలు వేసుకున్నారని కోర్టుకు వివరించారు. అయినా వారికి పునరావాసం కల్పించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. 67 మందికి ఇచ్చేందుకు 91 ఎకరాల భూమిని ఎంపిక చేశామని, ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకూ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల్లోగా వారికి భూమిని కేటాయించాలని, సాగుకు అవసరమైన బోర్లు, ఇతర సౌకరాల్ని కల్పించాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ, ఇరిగేషన్ శాఖలను ఆదేశించింది. వాళ్ల పశువుల్ని తిరిగివ్వాలని, ఏడాదిలోగా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని స్పష్టం చేసింది. అప్పటివరకు వాంకిడి హాస్టల్‌లో ఉంచి ఆహారం, వసతి, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించింది. అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయకపోతే బాధితులు తిరిగి కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది.