నెలకు రూ.4 లక్షలు సరిపోవటం లేదా..? షమీ మాజీ భార్యకు సుప్రీం కోర్టు సూటి ప్రశ్న !

నెలకు రూ.4 లక్షలు సరిపోవటం లేదా..? షమీ మాజీ భార్యకు సుప్రీం కోర్టు సూటి ప్రశ్న !

నెలవారి ఖర్చులకు నాలుగు లక్షల రూపాయలు సరిపోవటం లేదా..? నాలుగు లక్షలంటే పెద్ద ఎమౌంటే కదా.. ఇవీ షమీ మాజీ భార్యకు సుప్రీం కోర్టు వేసిన సూటి ప్రశ్నలు. ఇండియన్ క్రికెటర్ మహమ్మద్ షమీపై అతని మాజీ భార్య హసిన్ జహాన్ వేసిన  భరణం పిటిషన్ విచారణ సందర్భంగా  సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. 

భరణం పెంచాల్సిందిగా హసిన్ వేసిన పిటిషన్ ను  2025 నవంబర్ 7 న  విచారించిన  సుప్రీం కోర్టు ఈ కేసులో  షమీకి, అదే విధంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. నాలుగు వారాల్లో స్పందించాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ లో మరోసారి వాదనలు విననున్నట్లు స్పష్టం చేసింది కోర్టు.

తనకు, తన కూతురుకు షమీ ఇచ్చే నెలకు నాలుగు లక్షల రూపాయలు సరిపోవటం లేదని ఆమె గతంలో కోల్ కతా హైకోర్టులో పిటిషన్ వేసింది. భార్యకు నెలకు లక్షన్నర, కూతురు మెయింటెనెన్స్ కోసం రూ.2.5 లక్షలు భరణంగా.. మొత్తం నెలకు నాలుగు లక్షలు చెల్లించాల్సిందిగా బెంగాల్ హైకోర్టు ఆదేశించింది. అయితే షమీకి ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్ ఆధారంగా అతను తమకు ఇచ్చే మొత్తం పెద్ద ఎమౌంటేమీ కాదని.. భరణాన్ని పెంచాల్సిందిగా వాదించింది. 

షమీ, హసీన్ జహాన్ కు 2014లో వివాహం అయితే, 2018లో విడిపోయారు. తన భర్త షమీ తనపై గృహ హింసకు పాల్పడుతున్నాడని హసీన్ 2018లో షమీపై కోల్ కతాలోని జాదవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. దీంతో పోలీసులు వరకట్నం వేధింపులు, గృహ హింస చట్టాల్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. 

అదే సమయంలో తమ ఖర్చుల కోసం నెలకు రూ.10 లక్షలు భరణం ఇచ్చేలా ఆదేశించాలంటూ హసీన్ కోర్టును ఆశ్రయించింది. ఇందులో రూ. 7లక్షలు తన ఖర్చుల కోసం కాగా మిగిలిన రూ.3 లక్షలు కూతురు మెయింటెనెన్స్ కోసమని పిటిషన్ లో పేర్కొంది. అప్పట్లో కేసు విచారించిన ట్రయల్ కోర్టు నెలకు రూ.1.30లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది. ఆ తర్వాత ట్రయల్ కోర్టు తీర్పును సమీక్షించిన వెస్ట్ బెంగాల్ హైకోర్టు భరణం రూ.4 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. దీంతో భరణం పెంచాల్సిందిగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది షమీ మాజీ భార్య.