ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 19 మంది మృతి చెందిన ఈ ఘటన తాలూకు ట్రాజెడీ నుంచి జనం ఇంకా బయటికి రాలేదు. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శుక్రవారం ( నవంబర్ 7 ) వేమూరి కావేరి ట్రావెల్స్ ఓనర్ వినోద్ కుమార్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో A1 గా ఉన్న బస్సు డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్యను ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు.
ట్రావెల్స్ ఓనర్ వినోద్ కుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ కర్నూలు కోర్టులో హాజరుపరిచారు. ఇదిలా ఉండగా.. డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణం గానే ప్రమాదం జరిగినట్లు FIR కాపీలో పోలీసులు స్పష్టం చేశారు. ఏ1 గా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ లక్ష్మయ్య, ఏ2గా వి కావేరీ ట్రావెల్స్ ఓనర్ వినోద్ కుమార్ ను నిందితుడిగా పోలీసులు చేర్చడం గమనార్హం. రమేష్ అనే ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు.
డ్రైవర్తో పాటు ఓనర్పై పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. BNS 125(a)తో పాటు 106(1) సెక్షన్లను కర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీసులు నమోదు చేశారు. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైంది.
ఉలిందకొండ మండలం చిన్నటేకూరు క్రాస్ రోడ్డు వద్ద బస్సు బైకును ఢీకొనడంతో మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు, ఆరుగురు మహిళలు సహా మొత్తం19 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఇద్దరు డ్రైవర్లు, నలుగురు చిన్నారులు సహా మొత్తం 46 మంది ఉన్నారు. లోపల దట్టమైన పొగ వ్యాపించడం, హైడ్రాలిక్ డోర్ తెరుచుకోకపోవడంతో అశ్విన్‌రెడ్డి అనే ప్రయాణికుడు డ్రైవర్‌సీటు వెనుకాల ఉన్న చిన్న మిర్రర్పగులగొట్టుకొని బయటకువచ్చాడు. ఆయన వెంట వచ్చిన మరో ముగ్గురు ప్రయాణికులు బస్సు వెనుక ఉన్న అద్దాన్ని పగుల గొట్టడంతో అందులోంచి మరో 21 మంది దూకారు. కానీ బస్సు ముందు భాగంలో ఉన్నవారంతా బయటకు రాలేక, మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు.
