చలిగా ఉంది.. మంచి దుప్పటి, బెడ్ షీట్ కావాలని అడగటమే పాపం.. ఏకంగా ఆర్మీ సోల్జర్ ను చంపేశాడు ఓ రైల్వే ఎంప్లాయ్. రాజస్థాన్ లో జరిగిన ఈ హత్య దేశ వ్యాప్తంగా సంచలనగా మారింది. 2025, నవంబర్ 02 న జరిగిన ఈ హత్య కేసులో విచారణకు ఆదేశించింది జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC).
రైల్వే కోచ్ అటెండెంట్ గా ఉన్న రైల్వే ఉద్యోగి.. బ్లాంకెట్, బెడ్ షీట్ విషయంలో జరిగిన వాదనలో ఆర్మీ సోల్జర్ ను చంపినట్లు రైల్వే శాఖ తెలిపింది.
అసలేం జరిగింది..?
ఇండియన్ ఆర్మీ సోల్జర్ జిగర్ చౌదరీ కొన్ని రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి గుజరాత్ లోని సబర్మతికి వెళ్తున్నాడు. నవంబర్ 02 రాత్రి పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ స్టేషన్ లో జమ్ము తవి - సబర్మతి ఎక్స్ ప్రెస్ ను ఎక్కాడు. మార్గ మధ్యలో తనకు బ్లాంకెట్, బెడ్ షీట్ ఇవ్వాలని B4 ఏసీ కోచ్ అటెండెంట్ ను అడిగాడు.
అయితే బెడ్ షీట్, బ్లాంకెట్ ఇవ్వటం కుదరదని.. రూల్స్ ప్రకారం ఇవ్వలేనని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాటలు కాస్త చేతలుగా మారాయి. చివరికి ఆవేశంతో కత్తితో సోల్జర్ పై దాడి చేశాడు రైల్వే అటెండెంట్. తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడిక్కడే చనిపోయాడు సోల్జర్ జిగర్ చౌదరీ.
బికనీర్ స్టేషన్ కు ట్రైన్ చేరుకున్న తర్వాత.. టికెట్ కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదేవిధంగా రైల్వే ఉద్యోగిపై మర్డర్ కేసు నమోదు చేశారు. నిందితుడిని జుబైర్ మెమోన్ గా గుర్తించారు. జుబైర్ అరెస్టు చేసి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
ఉద్యోగం ఎలా ఇచ్చారు: NHRC
సహ్యాద్రీ రైట్స్ ఫోరమ్ అనే ఒక ఎన్జీవో ఫిర్యాదుతో.. మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. రైల్వేలో ఉద్యోగాల నియామకంపై సీరియస్ అయ్యింది. ఆ ఉద్యోగిని నిబంధనలకు విరుద్ధంగా నియమించారని.. అపాయింట్మెంట్ ప్రాసెస్ ను అందజేయాల్సిందిగా ఆదేశించింది. అతని క్వాలిఫికేషన్, ట్రైనింగ్, పోలిస్ వెరిఫికేషన్ మొదలైన అన్ని రకాల విచారణలను హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా ఆదేశించింది.
