షాద్ నగర్, వెలుగు: సేంద్రియ వ్యవసాయం ద్వారా అధిక దిగుబడి సాధించుకోవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కన్హా శాంతి వనంలో జరిగిన మెగా కిసాన్ మేళాకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తాను 40 ఏండ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నానని, యూరియా వాడకాన్ని తగ్గించి జీవ ఎరువులు వాడితే అధిక ఉత్పత్తులతోపాటు నేలను సంరక్షించుకోవచ్చన్నారు.
అనంతరం ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో అధిక దిగుబడులు సాధించిన 17 మంది అభ్యుదయ రైతులను రైతు రత్నా అవార్డులతో సత్కరించారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, ఏషియన్ పీజీపీఆర్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎంఎస్ రెడ్డి, ఇఫ్కో చైర్మన్ యోగేందర్ హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల నుంచి సుమారుగా 5 వేల మంది అభ్యుదయ రైతులు, వివిధ సంస్థల శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
