
ప్రమాణాలతోనే అన్నీ పరిష్కారమైతే కోర్టులెందుకు?: మంత్రి కేటీఆర్
సమయం వచ్చినప్పుడు సీఎం అన్ని వివరాలు వెల్లడిస్తరు
దొంగెవరో.. దొరెవరో.. ప్రజలకు త్వరలోనే అర్థమైతదని కామెంట్
హైదరాబాద్ : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో దొంగ ఎవరో.. దొర ఎవరో ప్రజలకు అర్థమైందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని తెలిపారు. ‘‘మేం బాధ్యత గల వ్యక్తులం.. మేం ఏం మాట్లాడినా ఇన్వెస్టిగేషన్‌ను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నం అంటారు.. ప్రజల ముందుకు అన్నీ వస్తున్నయి” అని అన్నారు. ‘‘దొంగెవరో.. దొరెవరో ప్రజలకు ఇప్పటికే అర్థమైంది.. మేం ఇప్పుడు మాట్లాడితే దురుద్దేశాలు ఆపాదిస్తరు..తొందరపడి వ్యాఖ్యలు చేయొద్దని మా పార్టీ శ్రేణులను నేనే కోరా.. ఇప్పుడు దాన్ని నేనే ఎలా తప్పుత.. సమయానుసారం అన్ని విషయాలను సీఎం మాట్లాడుతారు..’’ అని కేటీఆర్ చెప్పారు. బీజేపీపై 21 అంశాలు, 13 పేజీలతో కూడిన చార్జ్‌షీట్‌ను శనివారం తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ రిలీజ్ చేశారు. 50 మంది ఎమ్మెల్యేలను కొని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడుగొట్టబోతున్నారన్న ప్రచారంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లతో బీజేపీకి సంబంధం లేదని యాదాద్రి ఆలయంలో బండి సంజయ్ ప్రమాణం చేసిన ఘటనపై కేటీఆర్ స్పందిస్తూ.. ప్రమాణాలు, ఇమానాలతోనే సమస్యలు పరిష్కారమైతే కోర్టులెందుకు, చట్టాలెందుకు అని ప్రశ్నించారు. రేపిస్టులకు దండలు వేసి సన్మానించిన వాళ్లు న్యాయం గురించి మాట్లాడితే ఎలా అని ఎద్దేవా చేశారు. అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో దేవుడ్ని తాకడంతో అపవిత్రం అయిందని, గుజరాత్ గులాం తాకిన దేవుడిని సంప్రోక్షణ చేయాలని తాను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
జూటా.. జుమ్లా పార్టీకి బుద్ధి చెప్పాలె
మునుగోడులో అసాధారణ పరిస్థితి కనిపిస్తోందని, తాను ఆ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని ఐదారు నెలల్లో అభివృద్ధి పరుగులు పెట్టిస్తానని కేటీఆర్ చెప్పారు. ‘‘అధికారంలో ఉన్న పార్టీలు చేసిన అభివృద్ధిని చెప్పి.. ప్రతిపక్షాలు తమను గెలిపిస్తే ఏం చేస్తామో చెప్పి ఉప ఎన్నికల్లో ఓట్లు అడుగుతాయి. కానీ ఎనిమిదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రజలకు చేసిందేమి లేదు కాబట్టే మా ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నది. కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నది. అందుకే జూటా.. జుమ్లా పార్టీపై ఆధారాలతో కూడిన చార్జ్‌షీట్ దాఖలు చేస్తున్నాం’’ అని కేటీఆర్ అన్నారు.
చార్జ్‌షీట్‌లోని ముఖ్యాంశాలు
- నల్గొండలో, మునుగోడులో ఫ్లోరోసిస్ నిర్మూలనను కేంద్రం పట్టించుకోలేదు, నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా భగీరథకు19 వేల కోట్లు ఇవ్వలేదు. జేపీ నడ్డా కేంద్ర వైద్య మంత్రిగా ఉన్నప్పుడు హామీ ఇచ్చిన ఫ్లోరైడ్ అండ్ ఫ్లోరోసిస్ మిటిగేషన్ సెంటర్, 300 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయలేదు.
- చేనేత ఉత్పత్తులపై 5% పన్ను వేసిన మొదటి ప్రధాని మోడీ.. దీన్ని 12%, 18 శాతానికి పెంచాలని చూస్తున్నారు. చేనేతలకు ఇచ్చే స్కీములు, సబ్సిడీలన్నీ రద్దు చేశారు.
- రైతులకు ఫ్రీ కరెంట్ దక్కకుండా మోటార్ల కాడ మీటర్లు పెట్టే కుట్ర చేస్తున్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌కు లోన్లు రాకుండా అడ్డుకున్నారు.
- కృష్ణా నదీ జలాల్లో 575 టీఎంసీల న్యాయమైన వాటా దక్కకుండా చేస్తూ ఉమ్మడి నల్గొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాల రైతులకు కేంద్రం తీరని అన్యాయం చేస్తున్నది. పొరుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకూ ఇవ్వలేదు. పాలమూరు - రంగారెడ్డి, డిండి, ఎస్‌ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతలకు అడ్డుతగులుతున్నది.
- ముడి చమురు ధరలు పడిపోయినా పెట్రో ధరలు పెంచి ఆ భారాన్ని ప్రజలపై మోపారు. ఇలా రూ.30 లక్షల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసి, అందులోంచి రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఇవ్వలేదు.
- ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని అసెంబ్లీ తీర్మానం చేసి పంపి ఐదేండ్లయినా ఆమోదించకుండా కేంద్రం తొక్కిపెట్టింది. దీనిపై పార్లమెంట్‌లో ప్రశ్న అడిగితే అలాంటి ప్రతిపాదనే రాలేదని పచ్చి అబద్ధం చెప్పింది.
- బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటకలో కల్లు గీయడాన్ని నిషేధించారు. అక్కడి ఈడిగ కులం వాళ్ల కడుపు కొడుతున్నది. ఇక్కడ మాత్రం బూటకపు వాగ్దానాలు చేస్తోంది.
- బీసీల జనగణన డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు.
- విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూల్‌లోని సంస్థలను విభజించకుండా రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతోంది. విభజన చట్టానికి తూట్లు పొడుస్తూ మనతో పాటు ఏపీకి అన్యాయం చేస్తోంది.
- బాయిల్డ్ రైస్ తీసుకోవాలని కోరితే ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయాలని హేళన చేశారు. దేశ రాజధానిలో 13 నెలలు రైతులు పోరాటం చేసేలా చేసి 700 మందికి పైగా రైతుల చావులకు
- కారణమయ్యారు.