- అడిగినంత డబ్బు ఇవ్వలేదని వ్యక్తిపై దాడి
- ఆటోలో తీసుకెళ్లి దాడి.. రన్నింగ్లో నెట్టివేత
- ఆటో టైర్లు కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయాలు
లక్ష్మణచాంద, వెలుగు: గృహప్రవేశ కార్యక్రమంలో హిజ్రాలు బీభత్సం చేశారు. అడిగినంత డబ్బు ఇవ్వనందుకు ఫంక్షన్‌లో నానా హంగామా చేసి వ్యక్తిని బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. నిర్మల్‌జిల్లా లక్ష్మణచాంద మండలంలోని చింతల్ చాంద గ్రామానికి చెందిన లింగట్ల రాజన్న ఇంట్లో ఆదివారం గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. నిర్మల్‌కు చెందిన నలుగురు హిజ్రాలు ఆటోలో అక్కడికి వచ్చి రూ.11 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తమకు అంత స్తోమత లేదని, రూ.3 వేలు ఇస్తామని రాజన్న చెప్పగా వారు ఒప్పుకోలేదు. బూతులు తిట్టి అతనిపై దాడి చేశారు. ఫంక్షన్‌లో బీభత్సం సృష్టించి రాజన్నను బలవంతంగా ఆటోలో ఎక్కించి కొద్దిదూరం తీసుకెళ్లి కిందికి తోసేశారు. ఈ ఘటనలో ఆటో రెండు టైర్లు రాజన్న కాళ్లపై నుంచి వెళ్లడంతో అతనికి గాయాలయ్యాయి. బాధితుడి భార్య మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణి తెలిపారు.

