హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు : మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు :  మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొద్దిగంటల్లో ప్రారంభంకానుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 68 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 55 లక్షల 7 వేల 261 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  ఎన్నికల కోసం అధికారులు 7వేల 887 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

హిమాచల్ లో రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా సీఎం పీఠాన్ని అధిష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ రెండు పార్టీలకు షాకివ్వాలని ఆప్ ప్రయత్నిస్తోంది. పంజాబ్ లో గెలిచిన ఊపులో ఉన్న ఆప్.. హిమాచల్ ప్రదేశ్ ను సైతం దక్కించుకోవాలని చూస్తోంది. దీంతో ఈసారి రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొంది. రాష్ట్ర అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8తో ముగియనుంది.