
సిమ్లా : ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీలోకి జంప్ చేసే ఎమ్మెల్యేలకు పింఛన్ కట్ చేయాలని హిమాచల్‌ప్రదేశ్ సర్కారు నిర్ణయించింది. , అనర్హతకు గురైన ఎమ్మెల్యేలను పెన్షన్‌కు అనర్హులు చేసేలా కాంగ్రెస్ సర్కారు రూపొందించిన సవరణ బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. ‘హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ (అలవెన్సెస్ అండ్ పెన్షన్ ఆఫ్ మెంబర్స్) సవరణ బిల్లు–2024’ ను సీఎం సుఖ్విందర్ సింగ్ మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లును బుధవారం సభ ఆమోదించింది.
ఇకపై పార్టీ మారి, ఫిరాయింపుల నిరోధక చట్టం, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం.. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలకు పెన్షన్ రద్దు వర్తించనుంది. కాగా, గత ఫిబ్రవరిలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడంతోపాటు పార్టీ విప్‌ను ధిక్కరించి, బడ్జెట్ సమావేశాలకు గైర్హాజరవడంతో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు పడింది.
ఉప ఎన్నికల్లో వీరిలో నలుగురు ఓడిపోగా, ఇద్దరు తిరిగి గెలిచారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కారు ఈ బిల్లును ప్రవేశపెట్టింది. కాగా, హిమాచల్ ప్రదేశ్‌లో మాజీ ఎమ్మెల్యేలకు ప్రస్తుతం నెలకు రూ.36 వేల పెన్షన్ ఇస్తున్నారు. ఐదేండ్ల కంటే ఎక్కువ పదవీకాలం సేవలు అందించిన వారికి అదనంగా మరో రూ. వెయ్యి అందజేస్తున్నారు.