ఢిల్లీకి ఇచ్చేందుకు మా రాష్ట్రంల నీళ్లు లేవు

ఢిల్లీకి ఇచ్చేందుకు మా రాష్ట్రంల నీళ్లు లేవు
  • సుప్రీం కోర్టుకు తెలిపిన హిమాచల్ సర్కారు

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టుకెక్కిన ఢిల్లీ తాగునీటి సమస్య రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటిదాకా తాము ఢిల్లీకి నీళ్లు తరలించామని చెప్పిన హిమాచల్ ప్రదేశ్ సర్కారు అసలు మా రాష్ట్రంలో మిగులు జలాలే లేవని, ఢిల్లీకి ఎలా ఇస్తామంటూ గురువారం సుప్రీం కోర్టులో వాదనలు వినిపించింది. దీంతో హిమాచల్ సర్కారుపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొద్దిరోజులుగా తాగునీళ్లు లేక ఢిల్లీ అల్లాడిపోతోంది.

మరోవైపు హీట్ వేవ్ ఢిల్లీ ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతోంది. దీనికి పరిష్కారంగా 137 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేయాలని సుప్రీం కోర్టు జూన్ 6న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నీళ్ల సరఫరాకు ఆటంకం కలిగించకుండా సులభతరం చేయాలని హర్యానా సర్కారునూ ఆదేశించింది. ఈ ఆదేశాలను తాము అమలు చేస్తున్నామని, ఇప్పటికే నిరాటంకంగా హర్యానాకు నీళ్లను విడుదల చేస్తున్నామని హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సుఖు బుధవారం మీడియాతో చెప్పారు.

ఆ నీళ్లను హర్యానా విడుదల చేయకుండా ఆపిందని ఆరోపించారు. దీనిపై సుప్రీం కోర్టులో గురువారం విచారణ సందర్భంగా హిమాచల్ సర్కారు మాట మార్చింది. తమ రాష్ట్రంలో మిగులు జలాలే లేవని చెప్పింది. ఇదే విషయాన్ని సరిగా చెప్పలేకపోయామంది. నీళ్ల సరఫరాకు ఆటంకం కలిగిందన్న తమ ప్రకటనను వాపస్ తీసుకుంటామంటూ క్షమాపణలు చెప్పింది. నీళ్ల సంక్షభానికి పరిష్కారం కనుక్కోవాలని సుప్రీం కోర్టు యమునా రివర్ బోర్డుకు సూచించింది.