హిమాచల్ ప్రదేశ్​లో 40 స్థానాల్లో కాంగ్రెస్​ గెలుపు

హిమాచల్ ప్రదేశ్​లో  40 స్థానాల్లో కాంగ్రెస్​ గెలుపు
  • 0.7% ఓట్ల తేడాతో 25 సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ
  • ముగ్గురు ఇండిపెండెంట్ల విజయం

హిమాచల్​ప్రదేశ్​లో కాంగ్రెస్​ ఘన విజయం సాధించింది. ఐదేండ్ల కోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని ఇక్కడి ఓటర్లు 1985 నుంచి కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఈసారి బీజేపీని కాదని కాంగ్రెస్​కు అధికారాన్ని అప్పజెప్పారు. కేవలం ఒక శాతం కంటే తక్కువ (0.7%) ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయింది. ఆమ్​ ఆద్మీ పార్టీ ఇక్కడ ఖాతా కూడా తెరువలేదు. ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్​ నుంచి సీఎం రేస్​లో మాజీ సీఎం, దివంగత వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్​ ముందు వరుసలో ఉన్నారు. శుక్రవారం శాసన సభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. 

సిమ్లా: హిమాచల్​ప్రదేశ్ ఓటర్లు సంప్రదాయం కొనసాగించారు. అధికార పక్షాన్ని కాదని ప్రతిపక్షానికి పట్టంకట్టారు. దీంతో కాంగ్రెస్​ పార్టీ ఘన విజయం సాధించింది. 1985 నుంచి అక్కడి ఓటర్లు బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలకు ఒక్కోసారి చాన్స్​ ఇస్తూ వస్తున్నారు. మొత్తం 68 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్​ 40 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 25 సీట్లకే పరిమితమైంది. ముగ్గురు ఇండిపెండెంట్​ అభ్యర్థులు గెలిచారు.

67 స్థానాల్లో పోటీ చేసిన ఆమ్​ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే పొందిన ఆప్.. అస్సలు ఖాతానే తెరవలేకపోయింది. బీజేపీకి 43%  ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్​కు 43.9%  ఓట్లు పడ్డాయి. ఆప్​కు ఒక శాతం, ఇతరులకు 12.3 శాతం ఓట్లు నమోదయ్యాయి. 2017తో పోలిస్తే.. బీజేపీ(49%)కి ఓట్ల శాతం తగ్గింది. కాంగ్రెస్​(42.20%) ఓటు షేర్​ కాస్త పెరిగింది. 40 స్థానాల్లో విజయం సాధించింది. ఇండిపెండెంట్​ అభ్యర్థులకు 8.80‌‌‌‌‌‌‌‌% ఓట్లు నమోదయ్యాయి. 

వరుసగా ఆరుసార్లు గెలిచిన జైరాం ఠాకూర్

హిమాచల్​ప్రదేశ్​ సీఎం జైరాం ఠాకూర్ మండి జిల్లాలోని సెరాజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్​అభ్యర్థి చేత్​రామ్​పై 21వేల మెజార్టీతో గెలిచారు. సెరాజ్​ నియోజకవర్గంలో 25ఏండ్లుగా బీజేపీ ఆధిపత్యం కొనసాగుతున్నది. అయినా కాంగ్రెస్, బీజేపీల మధ్య గట్టి పోటీ ఉంటుంది. 1998 నుంచి సెరాజ్ నియోజక వర్గం నుంచి జైరాం ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఫస్ట్​ టైం 1993లో 26 ఏండ్ల ఏజ్​లో చచ్యోట్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1998 నుంచి ఇప్పటిదాకా గెలుస్తూనే ఉన్నారు.

2017 ఎన్నికల్లో ఠాకూర్ 11వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 75వేల మంది ఓటర్లున్న ఈ సీటుకు ఈసారి ఆరుగురు అభ్యర్థులు పోటీ చేశారు. సీపీఐ(ఎం) నుంచి మహేందర్‌‌‌‌ సింగ్, ఆప్​ నుంచి గీతానంద్, బీఎస్పీ నుంచి ఇంద్రా దేవి, స్వతంత్ర అభ్యర్థి నరేందర్ కుమార్‌‌‌‌, కాంగ్రెస్ నుంచి చేత్​రామ్​ ఠాకూర్  పోటీ పడ్డారు. జైరాం ఠాకూర్‌‌‌‌‌‌‌‌కు 75% ఓట్లు వచ్చాయి.