
- ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి బీభత్సం
- ఇల్లు కూలి ముగ్గురు మృతి.. మరొకరు గల్లంతు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వానకు పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడ్డాయి.
మండి జిల్లాలోని బ్రగ్తా గ్రామంలో కొండచరియలు విరిగి ఓ ఇంటిపై పడ్డాయి. దీంతో ఆ ఇల్లు కూలిపోయి ఓ చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. మరో ఇద్దరిని అధికారులు రక్షించారు. మరోవైపు సిమ్లా పట్టణంలోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. సిటీ మధ్యలోని హిమ్‌ల్యాండ్ దగ్గర్లో అర్ధరాత్రి ఒంటిగంట టైమ్‌లో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కొన్ని వాహనాలు శిథిలాల కింద కూరుకుపోయాయి.
‘‘హిమ్‌ల్యాండ్ దగ్గర్లో నా కారు పార్క్ చేసుకుని పడుకున్నాను. భారీ వర్షం పడుతుండగా, అర్ధరాత్రి ఒంటిగంట టైమ్‌లో పెద్ద శబ్దం వినిపించింది. పైనుంచి చెట్లు, రాళ్లు కూలడం గమనించాను. వెంటనే కారు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాను” అని గౌతమ్, రాహుల్ శుక్లా అనే ఇద్దరు వ్యక్తులు తెలిపారు. సిమ్లాలో సోమవారం సాయంత్రం నుంచి ఏకధాటిగా 12 గంటల పాటు భారీ వర్షం కురిసిందని, 14.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
మునిగిన బస్టాండ్..
భారీ వర్షాలకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు డ్యామేజీ అయ్యాయి. మండి జిల్లా ధరంపూర్ మెయిన్ బస్టాండ్ సహా దాని చుట్టుపక్కల ఉన్న షాపులను వరద ముంచెత్తింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వెహికల్స్ కొట్టుకుపోయాయి. షాపులు, ఇండ్లలోకి వరద చేరింది. దీంతో రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. వరదలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.