
- గువాహటి బార్డర్లో న్యాయ్ యాత్రను అడ్డుకున్న పోలీసులు
- సిటీలో ట్రాఫిక్ జామ్ అవుతుందన్న సీఎం
- బారికేడ్లను తోసుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలు
గువాహటి : కాంగ్రెస్ మాజీ చీఫ్, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని అంతకుముందు సీఎం హిమంత బిస్వ శర్మ పేర్కొన్నారు. దీంతో రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని డీజీపీ జీపీ సింగ్‌కు సూచించారు. దీంతో రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్లపై పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. అస్సాం రాజధాని గువాహటి బార్డర్లో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ను పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం ఉదయం కాంగ్రెస్ కార్యకర్తలు గువాహటి సిటీలోకి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నించగా.. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ లీడర్లు వాటిని పక్కకు తోసేసి సిటీలోకి దూసుకెళ్లేందుకు ట్రై చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లీడర్లు, పోలీసులు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తాము యాత్రను అడ్డుకోవడం లేదని, రూట్ మార్చాల్సిందిగా సూచించామని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. ట్రాఫిక్ జామ్ అవుతుందని, లోయర్ అస్సాం నుంచి యాత్రను కొనసాగించాలని చెప్తే.. ప్రజలను రాహుల్ రెచ్చగొడ్తున్నారని మండిపడ్డారు. అందుకే, రాహుల్‌పై కేసు రిజిస్టర్ చేయాల్సిందిగా డీజీపీని ఆదేశించినట్టు తెలిపారు.
ఇది అస్సాం కల్చర్ కాదు: హిమంత బిస్వా శర్మ
బారికేడ్లను బద్దలు కొడుతూ.. జనాలను రెచ్చగొట్టడం నక్సలైట్ల వ్యూహమని సీఎం హిమంత బిస్వాశర్మ విమర్శించారు. గువాహటి బార్డర్ వద్ద బారికేడ్లను తోసేస్తున్న వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘‘ఇది అస్సాం కల్చర్ కాదు. మాది శాంతియుత రాష్ట్రం. కాంగ్రెస్ లీడర్లు నక్సలైట్ల మాదిరి ప్రవర్తిస్తున్నరు. రూట్ మ్యాప్ ప్రకారమే యాత్ర కొనసాగించాలి. పోలీసులు.. పబ్లిక్కు మాత్రమే సర్వెంట్లు.. రాజకుటుంబీకులకు కాదు.. అందరూ చట్టబద్ధంగా వ్యవహరించాల్సిందే..’’ అని హిమంత స్పష్టంచేశారు. సిటీ చుట్టూ రింగ్ రోడ్డుపై ఉన్న 27వ నంబర్ నేషనల్ హైవే మీదుగా వెళ్లాలని సూచించారు. దీంతో చివరికి చేసేదేమీ లేక.. రింగ్ మీదుగా రాహుల్ యాత్ర కొనసాగించారు.
కావాలనే అడ్డుకున్నరు : రాహుల్
తాము బారికేడ్లు మాత్రమే దాటుకొని వచ్చామని.. చట్టాన్ని ఉల్లంఘించలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అస్సాం ప్రభుత్వం కావాలనే యాత్రను అడ్డుకుం టోందని మండిపడ్డారు. గువాహటి బార్డర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికీ భయపడరన్నారు. బీజేపీని ఓడించి.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని తెలిపారు. గతంలో భజరంగ్‌దళ్, ఇటీవల బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా ఇదే రూట్లో యాత్ర చేశారని చెప్పారు. తమను ఎందుకు ఆపుతున్నార ని ప్రశ్నించారు. ‘‘మీ డ్యూటీ మీరు చేస్తున్నరు. పై నుంచి వచ్చిన ఆదేశాలను పాటిస్తున్నరు. కానీ.. మీరు ఒకటి గుర్తుంచుకోండి.. అస్సాంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలి. దేశంలో అత్యంత అవినీతి సీఎం ఎవరైనా ఉన్నారా ఉంటే.. అది మీ ముఖ్యమంత్రే’’ అని అస్సాం పోలీసులను ఉద్దేశించి రాహుల్ అన్నారు.