దేశంలోనే అవినీతి సీఎం హిమంత.. అస్సాం సీఎంపై మండిపడ్డ రాహుల్

దేశంలోనే అవినీతి సీఎం హిమంత.. అస్సాం సీఎంపై మండిపడ్డ రాహుల్
  • మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. భయపడే ప్రసక్తే లేదని కామెంట్
  • ఏడోరోజు బార్పేటలో కొనసాగిన భారత్ జోడో న్యాయ్ యాత్ర

బార్పేట(అస్సాం): దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన సీఎం హిమంత బిశ్వ శర్మ అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. అస్సాం సీఎంను కంట్రోల్ చేసే రిమోట్ కేంద్ర హోం మంత్రి అమిత్​షా చేతుల్లో ఉందన్నారు. అమిత్​ షాకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా.. పార్టీ నుంచి ఆయనను రెండు నిమిషాల్లో గెంటేస్తారని కామెంట్ చేశారు. అస్సాంలోని బార్పేట జిల్లాలో ఏడోరోజు బుధవారం భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. అస్సాంలో అవినీతి పరంపర కొనసాగుతోందన్నారు. ప్రజాధనాన్ని హిమంత దొంగిలించాడని, కజిరంగా నేషనల్ పార్క్​ భూమిని కబ్జా చేశాడని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే తన యాత్రను సర్కారు అడుగడుగునా అడ్డుకుంటోందని మండిపడ్డారు.

కేసులు పెడితే భయపడే వ్యక్తిని కాను..

అంతకుముందు రోజు యాత్రలో ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా రాహుల్​పై అస్సాం పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడబోనన్నారు. ‘‘కేసులు పెట్టి నన్ను భయపెట్టాలనే ఆలోచన బిశ్వ శర్మకి ఎట్లొచ్చిందో నాకు తెల్వదు. ఇంకో 25 కేసులు పెట్టండి. నేను భయపడ. బీజేపీ, ఆర్ఎస్ఎస్​ల బెదిరింపులకు నేను బెండ్ కాను” అని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ మిత్రుడు అదానీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే తనపై గతంలో కేసు పెట్టారని గుర్తుచేశారు. పార్లమెంటు నుంచి గెంటేశారని, ఆపై తన అధికార నివాసాన్ని గుంజుకున్నారని చెప్పారు. ‘‘నిజానికి ఆ అధికార నివాసం అక్కర్లేదని నేనే తాళాలు ఇచ్చేశా. నా ఇల్లు ప్రతి భారతీయుడి మనసులో ఉంది. అస్సాం, ఒడిశా, ఉత్తరప్రదేశ్ ఇలా చాలా రాష్ట్రాల్లోని లక్షలాది మంది గుండెల్లో నివాసం ఉంట” అని రాహుల్ గాంధీ చెప్పారు.

అస్సాం ప్రజల ఆత్మగౌరవం తాకట్టు..

బీజేపీ ప్రభుత్వం అస్సాం ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతోందని రాహుల్ మండిపడ్డారు. అస్సాం భాష, సంస్కృతి, చరిత్రను బీజేపీ, ఆర్ఎస్ఎస్ తుడిచేయాలని చూస్తున్నాయన్నారు. రాష్ట్రాన్ని నాగాలాండ్ నుంచి పాలించాలని చూస్తున్నాయన్నారు. తాముండగా ఆ పని జరగనివ్వబోమన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం బిశ్వ శర్మ హృదయాలు ద్వేషంతో నిండిపోయాయని రాహుల్ ఆరోపించారు. ఇందులో భాగంగానే మణిపూర్​లో ఘోరాలు జరిగాయని, ఎంతోమంది ఇండ్లు తగలబడ్డాయని గుర్తుచేశారు. అయితే, తన పోరాటం బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యాప్తి చేస్తున్న ద్వేషంపైనే అని రాహుల్ చెప్పారు. ఆ ద్వేషాన్ని నిర్మూలించడానికి ప్రతిఒక్కరమూ ప్రేమను ఉపయోగిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. మనది ప్రేమ దేశమని, ఇక్కడ ద్వేషం ఎప్పటికీ గెలవదని అన్నారు.

బీజేపీ నేతల్లో భయం మొదలైంది: కన్హయ్య విమర్శ

భారత్ జోడో న్యాయ్ యాత్రకు బీజేపీ సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ నేత కన్హయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ జోడో యాత్ర సక్సెస్ కావడంతో బీజేపీ నేతలకు భయం పట్టుకుందని, అందుకే న్యాయ్ యాత్రను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అస్సాంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. అస్సాం బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలను సంతోషపెట్టేందుకు ఏ స్థాయికైనా దిగజారేందుకు వెనకాడట్లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని యువత, మహిళలు, రైతులు, కూలీలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని, వీళ్లకు న్యాయం జరిగితేనే దేశం బలపడుతుందని అన్నారు. దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం నెలకొల్పేందుకే తాము భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టామన్నారు.