హిమాయత్ సాగర్ గేటు ఎత్తివేత.. మూసీకి 350 క్యూసెక్కుల వరద నీరు విడుదల

హిమాయత్ సాగర్ గేటు ఎత్తివేత.. మూసీకి 350 క్యూసెక్కుల వరద నీరు విడుదల

హైదరాబాద్‎లో గురువారం (ఆగస్ట్ 7) రాత్రి కుండపోత వర్షం కురిసింది. దాదాపు గంటన్నర పాటు రికార్డ్ స్థాయిలో వాన బీభత్సం సృష్టించింది. సిటీలో నాన్ స్టాప్‎గా గంటన్నర సేపు వర్షం కురవడంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్‎కు వరద నీరు పొటెత్తింది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో హిమాయత్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. హిమాయత్‌సాగర్‌ జలాయశం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో రిజర్వాయర్ ఒక గేట్ అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.

ప్రస్తుతం హిమాయత్ సాగర్‏కు 1000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. మూసీ నదిలోకి 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలోకి వెళ్లొద్దని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అలర్ట్ చేశారు. 

భారీ వర్షాలతో హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడం, ట్రాఫిక్‌కు అంతరాయం, విద్యుత్‌ సమస్యలపై కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు. ఫోన్‌ చేయాల్సిన నంబర్లు: 040-2302813 / 74166 87878. రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు చేసి రెవెన్యూ అధికారులందరూ అందుబాటులో ఉండాలని.. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పనిచేయాలని హైదరాబాద్ కలెక్టర్ హరి చందన ఆదేశించారు.

హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వివరాలు:

  • పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు
  • ప్రస్తుత నీటి స్థాయి : 1762.60 అడుగులు
  • రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.970 టీఎంసీలు
  • ప్రస్తుత సామర్థ్యం : 2.715 టీఎంసీలు
  • ఇన్ ఫ్లో : 1000 క్యూసెక్కులు
  • అవుట్ ఫ్లో : 350 క్యూసెక్కులు
  • మొత్తం గేట్ల సంఖ్య : 17
  • ఎత్తిన గేట్ల సంఖ్య : 01