
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపు
కోల్‌కతా: హిందూ సమాజం ప్రపంచ వైవిధ్యాన్ని అంగీకరిస్తూ ముందుకు సాగుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం ఉందనే సత్యాన్ని హిందూ సమాజం నమ్ముతోందన్నారు. ఆదివారం వెస్ట్ బెంగాల్‌లోని వర్ధమాన్ సిటీలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
హిందూ సమాజం మరింత ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని భగవత్ పేర్కొన్నారు. మంచి సమయాల్లోనూ ఆపదలు రావొచ్చని, అప్పుడు సమాజంలోని ఐక్యతే ఉపయోగపడుతుందని చెప్పారు. ఐక్యతే దేశ స్థితిగతులను మారుస్తుందన్నారు. సమస్య ఎలాంటిది అనేదానికంటే.. దాన్ని ఎదుర్కొనేందుకు మనం ఎంత సిద్ధంగా ఉన్నామనేదే ముఖ్యమని అన్నారు.
హిందూ సమాజంపై మాత్రమే ఎందుకు దృష్టిపెడతామని ప్రజలు తరచుగా అడుగుతుంటారని మోహన్ భగవత్ గుర్తుచేశారు. అందుకు తాను.. ప్రపంచంలో బాధ్యతాయుతమైన సమాజం ఏదైనా ఉంది అంటే, అది హిందూ సమాజమేనని చెప్తానని అన్నారు. దేశాన్ని ఏలిన మహారాజులను, చక్రవర్తులను ప్రజలు గుర్తుపెట్టుకోరని, తండ్రికి ఇచ్చిన మాటకోసం 14 ఏండ్లు అజ్ఞాతంలోకి వెళ్లిన రాజునే గుర్తుంచుకుంటారని చెప్పారు.
హిందువులు అలాంటి విలువలు అనుసరిస్తారని, దేశంలోని భిన్నత్వాన్ని ఏకత్వాన్ని నిలిపి ఉంచుతారని చెప్పారు. భారత్‌ను బ్రిటిష్ వాళ్లు సృష్టించలేదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనతో ఈ దేశం ఎన్నో శతాబ్దాల నుంచి వర్ధిల్లుతూనే ఉందని చెప్పారు.