మైనార్టీల రక్షణకు ప్రత్యేక చట్టం 

మైనార్టీల రక్షణకు ప్రత్యేక చట్టం 
  • బంగ్లాదేశ్ తాత్కాలిక​ ప్రభుత్వానికి స్టూడెంట్ల డిమాండ్​
  • ఫాస్ట్​ట్రాక్ ట్రిబ్యునల్స్ఏర్పాటు చేయాలి
  • హిందూ స్టూడెంట్లతో భేటీఅయిన మహమ్మద్ యూనస్

ఢాకా : బంగ్లాదేశ్​లోని మైనార్టీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆ దేశ ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్​ను హిందూ స్టూడెంట్లు కోరారు. మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా పారిపోయిన తర్వాత హిందువులే లక్ష్యంగా దాడులు జరిగాయని వివరించారు. ఇది హేయమైన చర్య అని తెలిపారు. హిందూ స్టూడెంట్లతో పాటు పలు మైనార్టీ సంఘాల నేతలు సోమవారం మహమ్మద్ యూనస్​తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

బంగ్లాదేశ్​లోని మైనార్టీలకు రక్షణ కల్పించాలని కోరారు. 52 జిల్లాల్లో 205 దాడులు జరిగాయని మహమ్మద్ యూనస్​కు మైనార్టీ నేతలు వివరించారు. ఈమేరకు 8 డిమాండ్లను ఆయన ముందుంచారు. బంగ్లాదేశ్​లోని మైనార్టీల హక్కులను కాపాడేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. అందరికీ ప్రభుత్వమే రక్షణ కల్పించాలని కోరారు. హిందువులపై దాడులను తీవ్రంగా పరిగణించాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందు రిలీజియస్ వెల్ఫేర్ ట్రస్ట్​ను ఫౌండేషన్​గా అప్​గ్రేడ్ చేయాలన్నారు.

మైనార్టీల భద్రత ప్రభుత్వానిదే..

పాలి ఎడ్యుకేషన్ బోర్డును మోడ్రనైజ్ చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్​ను హిందూ స్టూడెంట్లు కోరారు. మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు,  హిందువులు, క్రిస్టియన్లు, బుద్ధిస్ట్ కుటుంబాలకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలన్నారు. మైనార్టీల మీద దాడులు జరగకుండా ప్రభుత్వమే చూసుకోవాలని తేల్చి చెప్పారు. కాగా, బంగ్లాదేశ్​లో అన్ని వర్గాల వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని యూనస్ అన్నారు. స్టూడెంట్ల డిమాండ్లపై అడ్వైజర్లతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

హిందువులారా.. మమ్మల్ని క్షమించండి : బంగ్లా హోంమంత్రి

బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెలరేగిన అల్లర్లు, హింసాకాండలో హిందువులకు తగినంత భద్రత కల్పించలేకపోవడంపై ఆ దేశ హోంమంత్రి షెకావత్ హుస్సేన్  క్షమాపణ చెప్పారు. హిందూ మైనారిటీని రక్షించే బాధ్యత మెజారిటీ ముస్లింలపై ఉందన్నారు. ఇకముందు హిందువుల భద్రతకు, పరిస్థితులను మెరుగుపర్చేందుకు తాము భరోసాగా నిలుస్తామని చెప్పారు. మధ్యంతర ప్రభుత్వానికి అవామీ లీగ్ పార్టీని నిషేధించే ఆలోచన లేదని షెకావత్ తెలిపారు.