హిందూవులు మతం మారాలంటే.. ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలా..?

హిందూవులు మతం మారాలంటే.. ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలా..?

మత మార్పిడీలపై గుజరాత్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.  హిందూవులు మతం మారాలంటే గుజరాత్‌ మతస్వేచ్ఛ చట్టం -2003 ప్రకారం   జిల్లా మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని స్పష్టం  చేసింది.  ఈ మేరకు ఏప్రిల్ 8న సర్క్యులర్ జారీ చేసింది.   గుజరాత్ మత స్వేచ్ఛ చట్టం ప్రకారం బౌద్ధమతం ప్రత్యేక మతంగా పరిగణించబడుతుందని పేర్కొంది. చట్టంలోని సెక్షన్ 5 (1) , 5 (2) ప్రకారం  హిందువులు బౌద్ధ, సిక్కు,  జైన మతాలలోకి మారే వారు నిర్ణీత ఫార్మాట్‌లో ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

బౌద్ధమతంలోకి మారడానికి దరఖాస్తు నిబంధనల ప్రకారం చేయడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. గుజరాత్‌లో ప్రతీ ఏడాది దసరా ఇతర పండగల సమయంలో ప్రజలు బౌద్ధమతంలోకి మారుతున్నారు.  వారంతా నియమాలు పాటించడం లేదు. హిందూ మతం నుంచి బౌద్ధ మతంలోకి మారడానికి ముందస్తు అనుమతి అవసరం లేదని కొందరు భావిస్తున్నారని ఉత్తర్వులో పేర్కొంది .

అందువల్ల  హిందూ మతం నుంచి బౌద్ధ, సిక్కు, జైన మతంలోకి మారేటప్పడు ఆ  వ్యక్తి జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి పొందాలి..అంతేకాకుండా మతం మారే వ్యక్తి జిల్లా మేజిస్ట్రేట్‌కి నిర్ణీత ఫార్మాట్‌లో సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.