
ముంబై: కరోనా వైరస్ కొత్త వేరియంట్ వచ్చినా కొత్త కొలువులపై దాని ఎఫెక్ట్ ఉండదని ఒక సర్వే రిపోర్టు వెల్లడించింది. అన్ని రంగాలలోని సీనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్తోపాటు, ఉద్యోగులపైనా ఈ సర్వే నిర్వహించినట్లు జీనియస్ కన్సల్టెంట్స్ తెలిపింది. సీనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్లో ఎక్కువమంది, ఉద్యోగులలో 73 శాతం మంది కొత్త వేరియంట్ ఎఫెక్ట్ ఉండదనే అభిప్రాయం తెలిపినట్లు ఈ సర్వే రిపోర్టులో పేర్కొంది. సర్వేలో 1,468 మంది సీనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్, ఉద్యోగులు పాల్గొన్నట్లు వివరించింది. బ్యాంకింగ్అండ్ ఫైనాన్స్, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్, ఎఫ్ఎంసీజీ, హాస్పిటాలిటీ, హెచ్ఆర్ సొల్యూషన్స్, ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ, లాజిస్టిక్స్, మాన్యుఫాక్చరింగ్, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా రంగాలకు చెందిన ఎగ్జిక్యూటివ్స్, ఉద్యోగులు సర్వేలో భాగం పంచుకున్నట్లు జీనియస్ కన్సల్టెంట్స్ పేర్కొంది. కొత్త వేరియంట్ వచ్చినా తమ ఉద్యోగాలకు ముప్పు రాదని 69 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పడం మరో విశేషమని తెలిపింది. కొత్త వేరియంట్ వచ్చినా ఒమిక్రాన్లాగే ఉండొచ్చని, హాస్పిటళ్లకు పరిగెత్తేలా ఉండకపోవచ్చని 71% మంది ఈ సర్వేలో వెల్లడించారు. హైబ్రిడ్ వర్క్ మోడల్స్నే చాలా కంపెనీలు ఎంకరేజ్ చేస్తాయన్నారు.