- ఫలక్‌నుమా ప్యాలెస్
ఫలక్‌నుమా ప్యాలెస్‌ను సర్ వికార్ ఉల్ ఉమ్రా నిర్మించాడు. ఈ ప్యాలెస్ తేలు ఆకారంలో ఉంటుంది. దీనిని ఆండ్రియా పల్లాడియో వాస్తుశైలిలో నిర్మించారు. ప్యాలెస్ నిర్మాణం 1884లో ప్రారంభించి 1893లో పూర్తిచేశారు. ఫలక్ నుమా అంటే ఉర్దూలో ఆకాశ దర్పణం అని అర్థం. ఈ ప్యాలెస్ రూప శిల్పి విలియం వార్డ్ మారెట్. దీని నిర్మాణంలో ఇటలీ చలువరాయి, ఇంగ్లండ్ చెక్కను ఉపయోగించారు.
బెల్లావిస్టా ప్యాలెస్
1905లో బెల్లావిస్టా ప్యాలెస్‌ను అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముస్లీహుద్దీన్ మహమ్మద్ నిర్మించాడు. బెల్లావిస్టా అంటే ఇటలీలో అందమైన వీక్షణం అని అర్థం. ప్రస్తుతం బెల్లావిస్టాలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) కార్యకలాపాలు నిర్వహిస్తున్నది
టౌన్‌హాల్
1905లో ఆరో నిజాం 40వ జన్మదినం సందర్భంగా పబ్లిక్ గార్డెన్లో టౌన్‌హాల్‌కు శంకుస్థాపన చేశాడు. దీని నిర్మాణాన్ని 1913లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పూర్తిచేశాడు. ఈ టౌన్హాల్నే ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ భవనంగా ఉపయోగిస్తున్నారు. ఈ అసెంబ్లీ భవనం సరాసెనిక్ – రాజస్థాన్ శైలిలో నిర్మించారు. దీనిని వైట్‌హౌస్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా వ్యవహరిస్తారు.
నిజామియా అబ్జర్వేటరీ
1908లో ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ కాలంలో స్థాపించారు. ఇది దేశంలో మూడో అబ్జర్వేటరీ. నిజామియా అబ్జర్వేటరీ స్థాపకుడు నవాబ్ జాఫర్ జంగ్. ఈయన మొదట 1901లో పిసల్ బండలో అబ్జర్వేటరీ ఏర్పాటు చేశాడు. నిజామియా అబ్జర్వేటరీ ఏర్పాటుతో హైదరాబాద్‌లో ఖగోళ పరిశోధనలు ప్రారంభమయ్యాయి.
విక్టోరియా మెమోరియల్
విక్టోరియా మహారాణి మీర్ మహబూబ్ అలీఖాన్‌కు గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా బిరుదును ఇచ్చింది. ఈ నేపథ్యంలో 1905లో సరూర్‌నగర్‌లో విక్టోరియా మెమోరియల్ అనాథ శరణాలయాన్ని నిర్మించాడు. ఈ ఆశ్రమాన్ని 1953లో నెహ్రూ సందర్శించి విక్టోరియా మెమోరియల్ హోం ఫర్ చిల్డ్రన్స్ అని పేరు మార్చాడు. వేల్స్ రాకుమారుడు హైదరాబాద్ రాజ్యాన్ని సందర్శించిన సమయంలో విక్టోరియా జననా హాస్పిటల్‌ను నిర్మించారు.
