
సుమారు 2వేల ఏళ్ల కింద క్రీ.పూ. 230 నుంచి క్రీ.శ. 220 వరకు ఆంధ్ర, శాతవాహనుల అతిప్రాచీన రాజధానిగా వెలుగొందిన కోటిలింగాల వైభవం గోదాట్లో కలిసిపోతున్నది. పుస్తకాల్లో చదివి, గూగుల్‌లో వెతికి, ఈ చారిత్రక క్షేత్రాన్ని చూసి తరిద్దామని ఇక్కడికి వస్తున్న ఔత్సాహికులు, చరిత్ర ప్రియులు, విద్యార్థులకు తీవ్ర నిరాశే మిగులుతున్నది. ఇప్పుడిక్కడ ఓ పక్క ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్, మరో పక్క మట్టి దిబ్బలు తప్ప మరేమీ లేవు. తవ్వకాల్లో బయటపడ్డ వేలాది నాణేలు, వందలాది కత్తులు కటార్లు, లెక్కలేనన్ని గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు, మరెన్నో అపురూప శిల్పాలు రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలలకూ తరలిపోయాయి. తెలంగాణ వస్తే కోటిలింగాల రూపురేఖలు మారుస్తామనీ.., ఆర్కియాలజీ విభాగంలో, హైదరాబాద్‌లోని వివిధ మ్యూజియాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి తదితర ప్రాంతాల్లో మగ్గుతున్న ఆ పురాతన వస్తు సామగ్రిని తెప్పిస్తామనీ.., ఇక్కడే మ్యూజియం ఏర్పాటుచేసి భద్రపరుస్తామనీ, పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన తొలి తెలంగాణ పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
ఏమిటీ కోటిలింగాల?
కోటిలింగాల పాత కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలంలోని గోదావరి తీర గ్రామం . ఒకప్పుడు శాతవాహనుల తొలిరాజధాని నగరం. ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించిన మొదటి ఆంధ్ర రాజులైన రాణా సమగోప, రాణా గోభద, రాణా నారన, రాణా కంపాయ ఇక్కడి నుంచే తెలుగు ప్రాంతాన్ని ఏలినట్లు చారిత్రక రుజువులున్నాయి. వీరి తర్వాత శ్రీముఖుడు (సీముకుడు) కోటిలింగాల కేంద్రంగా స్వతంత్ర శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడనీ, అలా క్రీ.పూ. 230 నుంచి క్రీ.శ. 220 వరకు సుమారు 450 ఏళ్లు ఈ రాజ్యం కొనసాగిందనే ఆధారాలూ లభించాయి.
ఘనమైన చరిత్ర..
రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో 1979 నుంచి 1984 వరకు ఇక్కడ ఆరు పొరల దాకా జరిగిన తవ్వకాల్లో అనేక ఇటుక కట్టడాలు, వివిధ రాజవంశాలకు చెందిన వందలాది సీసం, రాగి నాణేలు, కత్తులు కటార్లు, అలంకరణ వస్తువులు బయటపడ్డాయి. కింది ఐదోపొర నుంచి పైన మొదటి పొర వరకు శాతవాహనల, చివరి ఆరో పొరలో ఆంధ్ర గోపుల నాణేలు దొరికాయి. దీంతో ప్రాచీన ఆంధ్ర చరిత్ర అనుకోని మలుపు తిరిగింది. శాతవాహనుల కంటే పూర్వమే కోటిలింగాల తెలుగుప్రాంత రాజధానిగా వర్ధిల్లిందని తేలింది. ఈ తవ్వకాలకు ముందు సీమాంధ్ర చరిత్రకారులంతా శాతవాహనుల తొలిరాజధాని ప్రతిష్ఠానపురం(పైఠాన్) అనీ, మలిరాజధాని ధాన్యకటకం(అమరావతి) అని వాదిస్తూ వచ్చారు. పాఠ్య, చరిత్ర పుస్తకాల్లోనూ ఇదే రాసుకున్నారు. కోటిలింగాల పేరును మచ్చుకైనా ప్రస్తావించలేదు. కానీ 1979 తవ్వకాల తర్వాత కోటిలింగాలే అతిప్రాచీన రాజధాని నగరమని ఒప్పుకోక తప్పలేదు. దీనికి సమీపాన ఎలిగేడు మండలంలోని ధూళికట్ట, పెద్దపల్లి పక్కనే ఉన్న పెద్దబొంకూర్ కూడా అప్పుడే వెలుగుచూశాయి.
20 ఏళ్ల తర్వాత నివేదిక..
గ్రీకు యాత్రికుడు మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో ప్రస్తావించిన ఆంధ్రుల 30 దుర్గాల్లో కోటిలింగాల, ధూళికట్ట రెండని పురావస్తు తవ్వకాలకు నేతృత్వం వహించిన కృష్ణశాస్త్రి అప్పట్లో స్వయంగా ప్రకటించారు. కానీ తవ్వకాలు జరిగిన సుమారు 20 ఏళ్లకుగానీ కోటిలింగాల ఎక్స్కవేషన్ రిపోర్ట్‌ను నాటి సీమాంధ్ర సర్కారు బయటపెట్టలేదు. తవ్వకాల్లో లభించిన ఏ ఒక్క పురాతన వస్తువునూ ఇక్కడ ఉంచలేదు. అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో ఆ అ‘పూర్వ’ సంపదంతా చెట్టుకొకటి.. పుట్టకొకటిగా తరలిపోయింది. ప్రస్తుతం కొన్ని వస్తువులు రాష్ట్ర ఆర్కియాలజీ విభాగంలో, హైదరాబాద్ సెంట్రల్ మ్యూజియంలో, నాగముచిలింద లాంటి అరుదైన శిల్పాలు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మూలుగుతున్నాయి.
ఇప్పుడేంటి పరిస్థితి?
ఎల్లంపల్లి రిజర్వాయర్ నిర్మాణంతో ఈ చారిత్రక దిబ్బకు మూడువైపులా నీళ్లు చేరాయి. దీంతో ఈ స్థావరాన్ని రక్షించేందుకు చుట్టూ సేఫ్టీ వాల్ నిర్మించి, పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, దేశ నలమూలల నుంచి టూరిస్టులను ఆకర్షిస్తామని అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. కానీ నేటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది అయ్యే పనికాదని తేలడంతో కనీసం ఇక్కడ ఓ మ్యూజియం ఏర్పాటుచేసి, తవ్వకాల్లో బయటపడ్డ వస్తుసామాగ్రి, కాయిన్స్, ఇతరత్ర అవశేషాలను వెనక్కి తెప్పించి, సందర్శకులకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ చరిత్రకారులు, కవులు, రచయితలు డిమాండ్ చేస్తున్నారు.
వెయ్యికిపైగా కాయిన్స్..
తవ్వకాల్లో రాణో గోభద, రాణో నారన, రాణో సిరి కంపాయ, రాణో సమగోప తదితర ఆంధ్రగోపులు, శ్రీముఖ లాంటి శాతవాహహనుల నాణేలే కాకుండా, అనేక పంచ్ మార్క్డ్ కాయిన్స్, రాతలేని నాణేలు, మహారథి, మహాగ్రామిక, శివసేవక, సాధకస పేర్లు గల ఇతర కాయిన్స్ లభించాయి. నాణేల ముద్రికలు లభించడం వల్ల ఇక్కడ ముద్రణాలయం కూడా ఉందని తేలింది. పురవాస్తు శాఖ సేకరించినవే కాకుండా, గ్రామప్రజల వద్ద ఉన్నవి, కరగవేసినవి, వెండి, రాగి, సీసం, ఇత్తడితో చేసినవి కలిసి సుమారు వెయ్యికిపైగా నాణేలను నాటి పురావస్తుశాఖ అధికారులు తీసుకెళ్లారు. వీటితోపాటు తవ్వకాల్లో దొరికిన నీటి తొట్టెలు, ఆభరణాలు, పూసలు, మట్టి పాత్రలు, టెర్రకొట్ట బొమ్మలు, నాగముచిలింద తదితర విగ్రహాలను వివిధ మ్యూజియాలకు తరలించారు.
మ్యూజియం పెట్టలె
ఆంధ్రా పాలకుల కారణంగా నిర్లక్ష్యానికి గురైన అతి ప్రాచీన రాజధాని కోటిలింగాలకు స్వరాష్ట్రంలోనైనా న్యాయం చేయాలె. 1979లో ఇక్కడ జరిగిన తవ్వకాల్లో కోటగోడలు, బావులు, ఇతర నిర్మాణాలు వెలుగుచూశాయి. వాటిని ఎలాగూ కాపాడలేకపోయారు. దొరికిన నాణేలు, చారిత్రక అవశేషాలను కూడా ఎక్కడెక్కడికో తరలించారు. వెంటనే వాటిని తెప్పించి ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేసి భద్రపరచాలె. తద్వారా కోటిలింగాల విశిష్టతను భావితరాలకు అందించాలె.
– జైశెట్టి రమణయ్య,
ప్రముఖ చరిత్ర పరిశోధకులు, జగిత్యాల
అభివృద్ధి చేయాలె..
స్వరాష్ట్రంలో కోటిలింగాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తారని ఆశించిన మాలాంటివారికి నిరాశే మిగిలింది. తవ్వకాల్లో దొరికిన కాయిన్స్, ఇతర చారిత్రక అవశేషాలను ఎక్కడెక్కడికో తరలించిన్రు. ఇప్పుడు ఆ అతి ప్రాచీన రాజ ధానికి ఎవరైనా వెళ్తే చూసేందుకు మట్టి దిబ్బలు తప్ప మరేమీ మిగల్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కోటిలింగాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలె. ఇక్కడే మ్యూజియం ఏర్పాటుచేసి ఆనాడు తరలించిన శాతవాహనుల అవశేషాలను తెప్పించి సందర్శకులకు అందుబాటులో ఉంచాలె.
‑ డాక్టర్ మలయశ్రీ,
కవి, చరిత్ర పరిశోధకులు, కరీంనగర్