ఆయిల్ ట్యాంకర్ల సమ్మె ఎఫెక్ట్.. క్యాన్ లు, ఖాళీ డబ్బాలతో క్యూ

ఆయిల్ ట్యాంకర్ల సమ్మె ఎఫెక్ట్.. క్యాన్ లు, ఖాళీ డబ్బాలతో క్యూ

రేపటి(జనవరి 03) నుంచి పెట్రోల్, డీజిల్ దొరకదంటూ వస్తున్న వార్తలతో.. ఆయిల్ ట్యాంకర్ల సమ్మెతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులన్నీ కిటకిటలాడుతున్నాయి. వందలాది బైక్ లు, కార్లు, ఆటోలు పెట్రోల్ కొట్టించుకోవడానికి బంకుల ముందు భారీ క్యూలు కట్టాయి. సమ్మె కారణంగా పెట్రోల్ బంకులు ఎన్నిరోజులు మూస్తారో.. మళ్లీ ఎప్పుడు పెట్రోల్ దొరుకుతుందోనని ముందు జాగ్రత్తగా స్టోరేజ్ చేసి పెట్టుకునేందుకు వాహనదారులు క్యాన్ లు, ఖాళీ డబ్బాలు పట్టుకొని లైన్ లలో నిల్చున్నారు. 

హైదరాబాద్ లో ఏ పెట్రోల్ బంకులో చూసినా వాహనదారులు బారులు తీరారు. బహీర్ బాగ్, హైదర్ గూడ, లక్డీకపూల్, ఖైరతాబాద్, బంజారహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, జీడిమెట్ల, గాజుల రామారం, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లోని పెట్రోల్  బంకుల ముందు భారీ రద్దీ నెలకొంది. దీంతో వాహనదారులను కంట్రోల్ చేయలేక కొన్ని పెట్రలో బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. 
   
అటు కుత్బుల్లాపూర్ లోని గాజులరామరం చిత్తరమ్మ టెంపుల్ దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. పెట్రోల్ బంకులు బంద్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కడుతున్నారు. ముందు జాగ్రత్తగా స్టోరేజ్ చేసి పెట్టుకునేందుకు వాహనదారులు క్యాన్ లు పట్టుకొని లైన్ లో నిల్చున్నారు. పెట్రోల్ దొరకదేమో, రేట్లు పెరిగే అవకాశం ఉందేమోనన్న అనుమానాలతో పెట్రోల్ బ్యాంకుల్లో జనాలు క్యూ కట్టారు. దీంతో పెట్రోల్ బంకుల నిర్వాహకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎల్బీ స్టేడియం దగ్గరలోని HP పెట్రోల్ బంకు దగ్గర కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. 

అటు దిల్ షుఖ్ నగర్, కొత్తపేట, ఎల్బీనగర్ ప్రాంతంలో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. రాత్రి వరకు అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ఖాళీ అయ్యే అవకాశం ఉందని వాహనదారులు అనుకుంటున్నారు. దీంతో పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. 

మరోవైపు రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ కూడలిలోని పెట్రోల్ బ్యాంకు దగ్గర పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరారు. సుమారు 3 కిలో మీటర్ల వరకు వాహనాల రద్దీ నెలకొంది. 

అలాగే నిర్మల్ జిల్లాలో పెట్రోల్ బంకుల దగ్గర కూడా భారీ ట్రాఫిక్ నెలకొంది. దేశవ్యాప్తంగా ట్రక్కులు, భారీ వాహనాల సమ్మె కారణంగా.. పెట్రోల్, డీజిల్ దొరకదేమోనని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా అలర్ట్ అయ్యారు. తమ వాహనాలకు పెట్రోల్ కొట్టించుకోవాలని డిసైడ్ అయ్యారు. 

మరోవైపు వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా బంకులపై ఆయిల్ ట్యాంకర్ల సమ్మె ఎఫెక్ట్ పడింది. సమ్మెతో పెట్రోల్ నిల్వలు తగ్గిపోతాయని పెట్రోల్ కోసం వాహనదారులు క్యూ కట్టారు. 

ఏమిటీ హిట్ అండ్ రన్ కేసు..

కేంద్ర ప్రభుత్వం ఇటీవల చట్టాల్లో సవరణలు చేసింది. అందులో హిట్ అండ్ రన్ కేసు ఒకటి. గతంలో ట్రక్కులు, లారీలు, బస్సులు, కార్లు ఇలా ఏ వాహనం అయినా యాక్సిడెంట్ అయితే.. అది హిట్ అండ్ రన్ కేసు అయితే పోలీస్ స్టేషన్ లోనే బెయిల్ వచ్చేది. అదే విధంగా శిక్షలు కూడా తక్కువగా ఉండేవి.. చట్ట సవరణతో హిట్ అండ్ రన్ కేసు తీవ్రత పెరిగింది. 10 లక్షల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

ఈ చట్టం వల్ల ట్రక్కు, లారీ, బస్సు డ్రైవర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. తప్పు ఎవరిదైనా శిక్ష మాకే పడుతుంది అంటూ.. ట్రక్కు, లారీ, బస్సు డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా మూడు రోజులుగా ఈ నిరసనలు జరుగుతున్నా.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే జనవరి 3వ తేదీ నుంచి ఆయిల్ ట్యాంకర్లు కూడా సమ్మెలోకి దిగుతామనే వార్తల క్రమంలో.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇది చర్చనీయాంశం అయ్యింది.. పెట్రోల్ కొరతకు దారి తీస్తుంది. ఇప్పటికే మహారాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది.