
- డివిజన్ల పరిధిపై కన్సల్టెన్సీ నియామకం
- లేఅవుట్స్ అనుమతుల జారీలో స్పీడ్ పెంచడమే లక్ష్యం
హైదరాబాద్సిటీ, వెలుగు: హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధి భారీగా పెరిగిన నేపథ్యంలో అధికారాల వికేంద్రీకరణపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్న జోనల్ వ్యవస్థను మరింత విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిధిలో నిర్మాణాల అనుమతులు, లేఔట్ల పర్మిషన్లలో పెరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకే హెచ్ఎండీఏలో జోనల్ డివిజన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో ఆరు జోన్లు శంషాబాద్, శంకర్పల్లి–1, శంకర్పల్లి–2, మేడ్చల్–1, మేడ్చల్–2, ఘట్కేసర్ ఉన్నాయి.
వీటి పరిధి పెరగడంతో ఇతర జిల్లాల్లో నిర్మాణాల అనుమతుల కోసం హైదరాబాద్కు రావాల్సి వస్తోంది. ప్రజలకు వ్యయప్రయాసాలు, జోనల్ అధికారులకు పని ఒత్తిడి పెరుగుతోంది. అందుకే అధికారాల వికేంద్రీకరణ చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటివరకు హెచ్ఎండీఏ పరిధి 7,257 చదరపు కి.మీ. ఉండగా కొత్తగా చేరిన ప్రాంతాలతో పరిధి 10,526 చ.కి.మీ.లకు పెరిగింది. మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1,359 గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి చేరాయి.
పెరిగిన అన్ని ప్రాంతాలకు సేవలు అందించాలంటే అంతర్గతంగా అధికారాలను వికేంద్రీకరించక తప్పదని అధికారులు అంటున్నారు. ఇతర ప్రభుత్వ సంస్థలైన మెట్రోవాటర్బోర్డు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, టీఎస్ఐఐసీ, టీజీఆర్ ఆర్టీసీ వంటి సంస్థలతో సమన్వయంతో పనిచేయాలని చూస్తున్నారు.
కన్సల్టెన్సీ అధ్యయనం..
హెచ్ఎండీఏలో అధికారాల వికేంద్రీకరణ, జోనల్ డివిజన్ల రూపురేఖలు, అధికారుల విధులు, పరిపాలనా తీరు ఎలా ఉండాలన్న దానిపై నివేదిక ఇచ్చేందుకు స్టాఫ్ రిక్రూట్మెంట్, మౌలిక సదుపాయాలు, ఐటీ రిక్వైర్మెంట్ రూపకల్పనకు త్వరలో ఒక కన్సల్టెంట్ను నియమించాలని అధికారులు నిర్ణయించారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు నిర్వహణ తీరు, భవిష్యత్లో చేపట్టబోయే వివిధ ప్రాజెక్టులు, సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి అన్న అంశాలను కన్సల్టెన్సీ ద్వారా అధ్యయనం చేయనున్నారు.
జోనల్ డివిజన్లన్నీ సంబంధిత జోనల్ కమిషనర్ల పరిధిలో పనిచేస్తాయని, దీంతో స్థానికంగా జరిగే అభివృద్ధిపై అధికారులు దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. నిర్మాణాలు, లేఔట్ల పర్మిషన్లు కూడా సత్వరం జారీ చేసేందుకు వీలుంటుంది.