ఎల్ ఈడీ లైట్లతో మెరిసిపోనున్న ఔటర్ రింగ్ రోడ్

V6 Velugu Posted on Jul 18, 2021

హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్ మొత్తం జిగేల్ మనిపించే ఎల్ఈడీ లైట్ల వెలుతురులో మెరిసిపోనుంది. గతంలో ప్రయోగాత్మకంగా 26 కి.మీ మేర రోడ్డుకు ఇరువైపుల ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయగా.. తాజాగా ఓఆర్ఆర్ వ్యాప్తంగా లైటింగ్ పనులపై హెచ్ఎండీఏ ఫోకస్ పెట్టింది. కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో పనులను వేగవంతం చేసి దసరా నాటికి పూర్తిస్థాయిలో లైట్లను ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.  మిగిలిన 136 కి.మీ మేర ఉన్న  ఓఆర్ఆర్ అండర్ పాసులు, జంక్షన్లు, ఇంటర్ ఛేంజెస్ ల దగ్గర ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల రాత్రివేళల్లో యాక్సిడెంట్లను నివారించడం, మరింత సేఫ్ జర్నీకి అవకాశం ఉంటుందని హెచ్ఎండీఏ గ్రోత్ కారిడార్ అధికారులు చెప్తున్నారు.

గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు..

గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర ఔటర్ రింగ్ రోడ్డు విస్తరించి ఉంది. 2018లో తొలిసారిగా ఓఆర్ఆర్ పై లైటింగ్ పనులను ప్రయోగాత్మకంగా చేపట్టారు. కేవలం గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు ఉన్న 26 కి.మీ మేర ఎల్ఈడీ లైట్లను అమర్చారు.  ఈ రూట్​లో రాత్రివేళల్లో యాక్సిడెంట్లు తగ్గడమే కాకుండా..జర్నీ ఈజీగా మారడంతో మిగిలిన 136 కి.మీ చుట్టూరా ఎల్ఈడీ లైట్లను ఏర్పాటుచేసేందుకు అధికారులు పనులు ప్రారంభించారు. దాదాపు రూ. 100 కోట్ల నిధులతో, నాలుగు ప్యాకేజీలుగా చేపడుతున్న ఈ ప్రాజెక్టును హెచ్ఎండీఏ ఇప్పటికే ఏజెన్సీలకు అప్పగించింది.

ఏడేండ్ల పాటు నిర్వహణ ఏజెన్సీలదే

ప్రాజెక్టు పూర్తి చేసి లైటింగ్ అందుబాటులోకి వచ్చిన ఏడేండ్ల వరకు నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీలు చూసుకుంటాయని అధికారులు చెప్తున్నారు.  మొదటి ప్యాకేజీ పనుల్లో భాగంగా కోకాపేట నుంచి సుల్తాన్ పూర్ వరకు,  ప్యాకేజీ –2లో సేరి గూడెం నుంచి శామీర్​పేట వరకు, మిగిలిన రెండు ప్యాకేజీలు కీసర నుంచి పెద్ద అంబర్ పేట వరకు, పెద్ద అంబర్ పేట నుంచి పెద్ద గోల్కొండ వరకు పోల్స్, ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. కూర్చున్న చోట నుంచే స్మార్ట్ ఫోన్ ద్వారా లైట్లు వెలుగుతున్నాయా లేదా అని తెలుసుకునే సిస్టమ్ ను ఓఆర్ఆర్ వెంబడి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఇంటర్ చేంజెస్ వద్ద లైటింగ్, ల్యాండ్ స్కేపింగ్ పనులతో ఓఆర్ఆర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

7 వేల స్తంభాలు, 13 వేల బల్బులు

దాదాపు 7 వేల స్తంభాలు, 13 వేల ఎల్ఈడీ బల్బులతో ఓఆర్ఆర్ చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు.  ఓఆర్ఆర్ మెయిన్ రోడ్డుకు ఇరువైపులా, ఇంటర్ ఛేంజెస్​లు, జంక్షన్లు, సర్వీస్ రోడ్లు, అండర్ పాసు రూట్లలోనూ బల్బులను బిగిస్తారు. కరెంట్ చార్జీల భారం లేకుండా సోలార్​పై అధ్యయనం చేసినా..నిర్మాణ వ్యయం పెరుగుతుందని కేవలం ఎల్ఈడీ లైట్లతో ప్రాజెక్టును హెచ్ఎండీఏ చేపడుతోంది.  సోలార్ అప్ గ్రేడేషన్​కు వీలుండేలా ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్లపై వెహికల్స్ రద్దీకి అనుగుణంగా లైటింగ్ ఆటోమేటిగ్​గా అడ్జెస్ట్ అయ్యేలా సిస్టమ్​ను రూపొందిస్తున్నారు.  డే టైమ్ లైట్​కి అనుగుణంగా పవర్ సప్లయ్​ నిలిచిపోతుందని హెచ్ఎండీఏ అధికారులు చెప్తున్నారు.
 

Tagged WORK, LED lights, HMDA focuse, throughout, ORR

Latest Videos

Subscribe Now

More News