రియల్​ ఎస్టేట్​ బిజినెస్​లోకి హెచ్​ఎండీఏ

రియల్​ ఎస్టేట్​ బిజినెస్​లోకి హెచ్​ఎండీఏ
  • డెవలప్​చేసి అమ్మిపెడితే 40%, కేవలం అమ్మిపెడితే 25% కమీషన్​ 
  • హెచ్​ఎండీఏ బ్రాండ్​ను క్యాష్​ చేసుకోవాలనుకుంటున్న ప్రభుత్వం
  • తుది దశకు చేరిన లేమూరులోని ప్రైవేటు భూముల డీలింగ్​
  • త్వరలో హౌసింగ్​ బోర్డు ల్యాండ్స్​ అర్రాస్

ప్రభుత్వ రంగ సంస్థ హెచ్​ఎండీఏ.. పక్కా రియల్​ఎస్టేట్​ బిజినెస్​ చేసేందుకు రెడీ అయింది. తన పరిధిలోని భూములను గడికిన్ని అమ్మేసి సర్కారుకు ఆమ్దానీ తెచ్చిపెడ్తున్న ఆ సంస్థ.. త్వరలో ఇతర ప్రభుత్వ రంగ సంస్థల భూములతోపాటు ప్రైవేటు వ్యక్తుల భూములను కూడా అమ్మిపెట్టి, అట్లా వచ్చే కమీషన్​ను సర్కారుకు అందించనుంది. సంస్థకు ఉన్న బ్రాండ్​ను రియల్​ దందా ద్వారా సొమ్ముచేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. 

హైదరాబాద్, వెలుగు: ఏడు జిల్లాల్లో విస్తరించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ (హెచ్​ఎండీఏ).. ఇక నుంచి రియల్​ ఎస్టేట్​ దందా నడుపనుంది. భూములమ్మి ఖజానా నింపుకోవాలనే ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్టుగా కొంత కాలంగా ఈ సంస్థ తన పరిధిలోని భూములను అమ్మేస్తూ వస్తున్నది. ఇప్పుడు ఇతరుల భూములను సమీకరించడం (ల్యాండ్ పూలింగ్) తోపాటు, డెవలప్ చేసి సేల్​ చేసేందుకు సిద్ధమవుతున్నది. ఇండ్లు, లే అవుట్ల పర్మిషన్లతో హెచ్​ఎండీఏ ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తున్నది. ఈ ఆదాయమే కాకుండా మరింత ఆమ్దానీ రాబట్టుకోవాలంటే హెచ్​ఎండీఏకు మార్కెట్​లో ఉన్న డిమాండ్​ను వాడుకోవాలని సర్కారు ప్లాన్​ చేస్తున్నది. భూములను హెచ్​ఎండీఏ అమ్మితే.. జనం ఈజీగా కొనుగోలు చేస్తారు. దీంతో హెచ్​ఎండీఏను రియల్​ ఎస్టేట్​ రంగంలోకి దింపాలని సర్కారు​ భావిస్తున్నది. 

సాధారణంగా ప్రైవేట్​ రియల్ ఎస్టేట్​ కంపెనీలు భూములను డెవలప్ చేయడం, అమ్మడం చేస్తుంటాయి. ఇందుకు భూ యజమానులతో ఫిఫ్టీ ఫిఫ్టీ కమీషన్‌ మాట్లాడుకుంటాయి. ఇదే తరహాలో భూముల డెవలన్‌మెంట్‌పై హెచ్ఎండీఏ  ఫోకస్ పెట్టింది. ప్రైవేటు భూములు సేకరించి, అభివృద్ధి చేసి, వేలంలో అమ్మి పెడితే 40% కమీషన్‌  తీసుకోనుంది. ప్రైవేట్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థల కంటే ఇది 10% తక్కువ. ఇటీవల లేమూరులో ప్రైవేటు వ్యక్తుల నుంచి 50 నుంచి 100 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కోసం సంస్థ చేపట్టిన ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. ఇక్కడ సంస్థ భరించాల్సిన నిర్వహణ వ్యయం భారీగా ఉండటంతో కేవలం వేలం బాధ్యతలను తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. నిర్వహణ వ్యయంలో భాగంగా దాదాపు రూ.100 కోట్ల నుంచి 150 కోట్లు డెవలప్ మెంట్‌కు, అగ్రిమెంట్ల రూపంలో మరో రూ.100 కోట్లను భూ యజమానులకు లేమూరులో ఇవ్వాల్సి ఉంటుంది. సంస్థకు ఇది భారమని భావించి.. తక్కువ పెట్టుబడితో, భారీ ఆదాయం లక్ష్యంగా కమీషన్ బేస్డ్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా వ్యవహరించాలని ఆఫీసర్లు ప్లాన్​ చేసినట్లు తెలిసింది. కమిషన్ బేస్డ్ వ్యాపారంలో డెవలప్‌మెంట్ పనులు ఇతర నిర్మాణ సంస్థలకు ఇచ్చి, భూములను హెచ్​ఎండీఏ అమ్మేయనుంది. అమ్మినందుకు 20 నుంచి 25% కమీషన్​ తీసుకోనుంది. నిర్వహణ భారం తక్కువైతే.. ల్యాండ్​ పూలింగ్, డెవలప్​మెంట్, వేలం లాంటి వాటినీ సంస్థనే చేపట్టనుంది.

త్వరలో హౌసింగ్​ బోర్డు భూములు అమ్మేసి..!
ఇతర ప్రభుత్వ రంగ సంస్థల భూములను కూడా హెచ్​ఎండీఏ అమ్మి పెట్టనుంది. తొలి దశలో కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులోని 25 ఎకరాల భూములపై ప్రయోగం చేయనుంది. ఈ భూమిలో ఇంటర్నల్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇతర సౌలతులు పోనూ దాదాపు 22 ఎకరాలు(1.06 లక్షల గజాలు) భూమిని అమ్మడానికి వీలుంటుంది. వేలంలో గజానికి రూ. 80 వేల 90 వేలు పలికినా.. రూ.850 కోట్ల నుంచి 900 కోట్ల ఆదాయం వస్తుంది. ఇందులో హెచ్ఎండీఏ కమీషన్ 20- నుంచి 25% ఉంటుందని సమాచారం. ఈ లెక్కన దాదాపు రూ. 200 కోట్ల ఆదాయం హెచ్ఎండీఏ పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపంలోకి రావడానికి మరో 3 నెలలు పడుతుందని సమాచారం. ఇదే గనుక పూర్తి చేస్తే హౌసింగ్​ బోర్డు తరహాలో ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు హెచ్ఎండీఏతో భూములు అమ్మించేందుకు ముందుకు రానున్నాయి.

ఇప్పటికే హెచ్​ఎండీఏ ల్యాండ్స్​ అమ్మకం ద్వారా రూ. 2500 కోట్ల ఆమ్దానీ
ఇటీవల హెచ్ఎండీఏ తన పరిధిలోని దాదాపు 250 ఎకరాల భూములను అమ్మేసి రూ. 2,500 కోట్ల ఆమ్దానీని సర్కారుకు తెచ్చిపెట్టింది. ఇందులో ఉప్పల్​ భగాయత్​, కోకాపేటలోని కొన్ని భూములు ఉన్నాయి. ఇంకా హెచ్ఎండీఏ పరిధిలో మరో 6,500 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. దశల వారీగా ఈ భూములన్నింటినీ సంస్థ అమ్మేయనుంది. ఇటీవల ఉప్పల్ భగాయత్ 3వ ఫేజ్ లో అమ్మేయగా మిగిలిన 16 వేల గజాల మూడు ప్లాట్లను మరికొంత ల్యాండ్ బ్యాంక్ తో కలిపి మరోసారి వేలం వేయనుంది.