వైబ్రంట్​  తెలంగాణకు ముందడుగు

వైబ్రంట్​  తెలంగాణకు ముందడుగు
  •     మాస్టర్​ ప్లాన్ ​రెడీ చేస్తోన్న హెచ్ఎండీఏ
  •     30 ఏండ్లకు రూపొందించేలా అధికారులు కసరత్తు  
  •     మరో రెండు కొత్త మాస్టర్​ప్లాన్​లు చేర్పునకు నిర్ణయం
  •     వరల్డ్ టాప్ టెన్ సిటీల్లో ఒకటిగా నిలిచేలా ప్రణాళిక

హైదరాబాద్, వెలుగు : వచ్చే 30 ఏండ్లలో  హైదరాబాద్​సిటీ ఎలా ఉండాలనే దానిపై ముందడుగు పడుతోంది. ఇందుకు హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాల మేరకు వైబ్రంట్​తెలంగాణ–2050 పేరుతో  ప్లాన్ తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే సిటీలో ఐదు మాస్టర్​ప్లాన్ లు ఉన్నాయి. జీహెచ్​ఎంసీ, హుడా, హడా, సీడీఏ, ఎక్స్ టెండెడ్​ఉండగా.. తాజాగా మరో రెండు ప్లాన్​లను కూడా అనుసంధానిస్తారు. ఐదు మాస్టర్​ప్లాన్​లను కలిపి యూనిఫైడ్​గా అమలు చేస్తే ఎలా ఉంటుందనే దానిపైనా ఆలోచన కూడా చేశారు.

భవిష్యత్ లో 7 మాస్టర్​ప్లాన్​లతో  సిటీ అభివృద్ధిలో మరింత దూసుకుపోతుందని అధికారులు భావిస్తున్నారు. కాంగ్రెస్​ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్​రెడ్డి వైబ్రంట్​తెలంగాణకు రూపకల్పన చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే రెండు కొత్త మాస్టర్​ప్లాన్ లు అయిన ఎకనామికల్​డెవలప్​మెంట్​ప్లాన్​(ఈడీఎంపీ), కాంప్రహెన్సివ్​మొబిలిటీ (సీఎంపీ)ని కూడా రాష్ట్ర సర్కార్ అమలు చేయనుంది. తద్వారా అంతర్జాతీయంగా టాప్​ టెన్ సిటీల్లో హైదరాబాద్ ఒకటిగా ఉండాలనే దృష్టితో రూపకల్పన చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. 

తొలుత ఆర్థికంగా ఎదిగేందుకు..   

హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే తొలుత ఆర్థికంగా కూడా ఎదగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఎకనామికల్​డెవలప్​మెంట్​ప్లాన్​(ఈడీపీ) పేరుతో సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. వచ్చే 30 ఏండ్ల ప్లాన్ లో సిటీని ఆర్థికంగా అభివృద్ధి చెందించడం, తద్వారా వరల్డ్ లో టాప్​10 సిటీల్లో ఉండేలా   చేయాలనే దానిపై పక్కా ప్లాన్ రూపొందుతున్నట్టు చెప్పారు. సిటీలో ఏయే ప్రాంతాల్లో ఎలాంటి ప్రాజెక్టులు తీసుకురావాలి, ఎలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే వాటిపై ప్లాన్ ఉండనున్నట్టు పేర్కొన్నారు.

పెరిగే జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పిన, భారీగా పెట్టుబడులు పెట్టేలా విదేశీ, స్వదేశీ కంపెనీలను ఆహ్వానించేందుకు తీసుకోవాల్సిన చర్యలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. అధికసంఖ్యలో పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు, స్థానిక వనరులను కూడా వాడుకుని ఆర్థికంగా సిటీ బలంగా ఎదిగేందుకు ఎలాంటి విధి విధానాలను అమలు చేయాలనే అంశాలను కూడా ప్లాన్ లో పొందుపరుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. 

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డెవలప్ మెంట్ పై ప్లాన్

 సిటీలో పెరిగే జనాభాకు అనుగుణంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ కూడా అభివృద్ధి చెందేలా ఒక మాస్టర్​ప్లాన్​రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో ట్రాఫిక్​సమస్య పరిష్కారానికి సమగ్ర ప్రజా రవాణా ప్లాన్​(సీఎంపీ)ను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం సిటీలో వాహనాల సంఖ్య 80 లక్షలు దాటిపోయింది. రోజుకు 3వేలకు పైగా కొత్తగా రోడ్డెక్కుతున్నాయి. దీంతో ట్రాఫిక్​జామ్​లు ఎక్కువ అవుతున్నాయి. మరోవైపు కాలుష్యం కూడా పెరుగుతోంది.  కొత్త మాస్టర్​ప్లాన్​లోనూ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఏం చేయాలనే అంశాలను కూడా చేర్చనున్నారు.

సొంత వాహనాల వాడకం తగ్గించడం, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తే బాగుంటుందనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. నేషనల్ అర్బన్​ట్రాన్స్​పోర్ట్​పాలసీ(ఎన్ యూటీపీ)కి అనుగుణంగా ప్రజలకు ఉపయోగంగా ఉండేలా, వారు ఖర్చు భరించే స్థాయిలో దీర్ఘకాల రవాణా వ్యూహాలు ఎలా ఉండాలనేవి కూడా మాస్టర్​ప్లాన్​లో పొందుపరుస్తారు. ఇలా మొత్తంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు.