- బంజారాహిల్స్‌లో 8, కొండాపూర్‌లో 20, నియోపొలిస్ వద్ద 70 ఎకరాల వేలానికి ఏర్పాట్లు
- మూడేండ్లలో రూ.30 వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ ప్లాన్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ప్రభుత్వ భూములను వేలం వేసి భారీగా నిధులు సమకూర్చుకునేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తున్నది. వేలం ద్వారా వచ్చే ఆదాయంతో హెచ్ఎండీఏ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే మూడేండ్లలో రూ.30 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
ఇందుకోసం బాండ్స్ ద్వారా రూ.20 వేల కోట్లు సేకరించాలని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. దీనికి సంబంధించి హెచ్ఎండీఏ ఆస్తులపై అప్పులు తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం బ్యాంకర్లతో సంప్రదింపులకు ఒక కన్సల్టెన్సీని కూడా నియమించుకున్నారు.
మంచి రేటు పలుకుతున్న భూములు
ఇటీవల కోకాపేటలో నిర్వహించిన వేలంలో 27 ఎకరాల భూమిని అమ్మడం ద్వారా హెచ్ఎండీఏకు రూ.3,862.8 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యధికంగా కోకాపేటలో ఎకరానికి రూ.151 కోట్లు పలకడంతో అధికారులు మరోసారి భూముల వేలానికి సిద్ధమవుతున్నారు. తాజాగా బంజారాహిల్స్‌లోని ఫిలిం నగర్లో ఇప్పటికే 8 ఎకరాల భూమిని ప్లాటింగ్ చేశారు. కొండాపూర్‌లోని మరో 20 ఎకరాల భూమిని కూడా త్వరలోనే లేఔట్చేసి అమ్మకానికి పెట్టాలని అధికారులు నిర్ణయించారు. కోకాపేటలోనే నియోపొలిస్ సమీపంలో హెచ్ఎండీఏకు ఉన్న మరో 70 ఎకరాల భూమిని లేఔట్చేసి వేలం వేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఒక్క కోకాపేట భూముల వేలం ద్వారానే దాదాపు 8 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఉప్పల్ భగాయత్‌లో మిగిలిపోయిన ప్లాట్లను వేలం చేయనున్నట్టు చెబుతున్నారు. ఇవే కాకుండా ల్యాండ్‌పూలింగ్ ద్వారా హెచ్ఎండీఏ పరిధిలో భూములను రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు.
నగరంలో ఇప్పటికే హెచ్ఎండీఏ రెండు చోట్ల ఎలివేటెడ్కారిడార్ల నిర్మాణానికి ప్లాన్ రెడీ చేసింది. ఒకటి ఇప్పటికే ప్రారంభమవగా మరో ప్రాజెక్టు పనులు త్వరలోనే మొదలు కానున్నాయి. ఇవే కాకుండా బంజారాహిల్స్ నుంచి కొండాపూర్ వరకు మరో ఎలివేటెడ్కారిడార్ నిర్మాణానికి హెచ్ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేసింది. ఆయా ప్రాజెక్టులకు అవసరమైన నిధులను భూముల వేలం ద్వారా సమకూర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
