ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్కు లింక్ రేడియల్ రోడ్లతో కనెక్టివిటీ

ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్కు లింక్ రేడియల్ రోడ్లతో కనెక్టివిటీ
  • 8 కి.మీ.కు ఒక రేడియల్ ​రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన
  • ఓఆర్ఆర్​ నుంచి ట్రిపుల్​ఆర్​కు లింక్​
  • సిటీ నుంచి నేరుగా ఓఆర్ఆర్​కు​ వెళ్లేందుకు మరికొన్ని రోడ్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు : మహానగరంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన రీజినల్​రింగ్​రోడ్​(ట్రిపుల్​ఆర్​)ను కనెక్ట్​చేసేందుకు భారీ సంఖ్యలో రేడియల్​రోడ్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ ప్రపోజల్స్​సిద్ధం చేసింది. వీటి ద్వారా నగరం చుట్టూ నిర్మించిన ఔటర్​రింగ్​రోడ్​(ఓఆర్ఆర్​) నుంచి నేరుగా ట్రిపుల్​ఆర్​కు అనుసంధానించనున్నారు. ఇప్పటికే రావిర్యాల నుంచి ఆమన్​గల్​వరకూ ఒక రేడియల్​రోడ్​నిర్మాణాన్ని ప్రారంభించిన అధికారులు త్వరలో మరికొన్నింటిని నిర్మించనున్నారు. తాజాగా హెచ్ఎండీఏ ఓఆర్​ఆర్​ నుంచి ట్రిపుల్​ఆర్​వరకు ప్రతి ఏడు నుంచి 8 కి.మీ.కు ఒక రేడియల్​రోడ్​నిర్మించాలని ప్రతిపాదించింది. ఓఆర్ఆర్​158 కి.మీ.

పరిధిలో ఈ రేడియల్​రోడ్లను నిర్మించి ట్రిపుల్​ఆర్​కు లింక్​చేస్తారు. భవిష్యత్తులో ఓఆర్ఆర్, ట్రిపుల్​ఆర్​ప్రాంతాలు కీలకం కానున్న నేపథ్యంలో ఈ రెండు రోడ్ల మధ్య పలు భారీ ప్రాజెక్టులు రానున్నాయి. ఓఆర్ఆర్​మీదుగా11 నేషనల్​హైవేస్​కూడా వెళ్తున్నాయి. వీటితో పాటు ఓఆర్ఆర్​చుట్టూ రేడియల్​రోడ్ల నిర్మాణం కూడా జరిగితే అక్కడి ప్రాంతాలు భారీగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.  

నేరుగా ఓఆర్ఆర్​కు

నగరం నుంచి నేరుగా  ఓఆర్ఆర్​ మీదకు చేరుకునేలా మరికొన్ని రోడ్లను అభివృద్ధి చేయాలని హెచ్​ఎండీఏ నిర్ణయించింది. దీనికి సంబంధించిన డీపీఆర్​కూడా అధికారులు రెడీ చేస్తున్నారు. ఇందులో షేక్​పేట నుంచి మణికొండ, మైహోమ్​అవతార్​, ఎంజీఐటీ వరకు 7 కి.మీ. రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. నానక్​రామ్​గూడ నుంచి ఓఆర్​ఆర్​కు మరో రెండు లేన్ల రోడ్​నిర్మించనున్నారు. బంజారాహిల్స్​ నుంచి ఫిలింనగర్​ మీదుగా శిల్పాలేఔట్​ వరకు 9 కి.మీ. ఎలివేటెడ్​ కారిడార్​ను ఓఆర్ఆర్​కు అనుసంధానం చేయనున్నారు. ఈ డీపీఆర్​ ఇప్పటికే రెడీ అయ్యింది.

వీటితో పాటు ఓఆర్​ఆర్​టు ట్రిపుల్​ఆర్​వరకూ అన్ని వైపుల నుంచి రోడ్లను అనుసంధానం చేసేందుకు ప్లాన్లు రూపొందించారు. శంషాబాద్​వద్ద వర్ధమాన్​కాలేజీ నుంచి లగచర్ల వరకు రోడ్డు అభివృద్ధి చేయనున్నట్టు అధికారులు తెలిపారు. దశల వారీగా మరికొన్ని రోడ్లను సిటీ నుంచి ఓఆర్ఆర్​కు..అక్కడి నుంచి ట్రిపుల్​ఆర్​వరకు విస్తరించేందుకు ఆలోచన చేస్తున్నారు. దీంతో భవిష్యత్​లో నగరం నుంచి ఎక్కడి నుంచైనా నేరుగా ట్రిపుల్​ఆర్​వరకు ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు.