అగ్రిమెంట్‌‌‌‌ అమలు విషయంలో హెచ్‌‌‌‌ఎండీఏ ప్రేక్షకపాత్ర పోషించింది : హైకోర్టు

అగ్రిమెంట్‌‌‌‌ అమలు విషయంలో హెచ్‌‌‌‌ఎండీఏ ప్రేక్షకపాత్ర పోషించింది : హైకోర్టు

రాంకీతో అగ్రిమెంట్ అమలుపై హెచ్‌‌‌‌ఎండీఏ తీరును తప్పుపట్టిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం శ్రీనగర్‌‌‌‌ గ్రామంలోని సర్వే 227, 230ల్లో రాంకీతో చేసుకున్న అగ్రిమెంట్‌‌‌‌ అమలు విషయంలో హెచ్‌‌‌‌ఎండీఏ ప్రేక్షకపాత్ర పోషించిందని హైకోర్టు ఆక్షేపించింది. అగ్రిమెంట్‌‌‌‌ అమలుకానప్పుడు చట్ట ప్రకారం హెచ్‌‌‌‌ఎండీఏ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని తపుపట్టింది. అగ్రిమెంట్‌‌‌‌ అమలు కాలేదని రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ నిషేధిత లిస్ట్‌‌‌‌లో చేర్చాలని రిజిస్ట్రేషన్‌‌‌‌ శాఖ రిజిస్ట్రార్‌‌‌‌ జనరల్‌‌‌‌కు హెచ్‌‌‌‌ఎండీ లేఖ మాత్రమే రాసి చేతులు దులుపుకుందని హైకోర్టు పేర్కొంది. శ్రీనగర్‌‌‌‌ గ్రామంలో రాంకీ, హెచ్‌‌‌‌ఎండీఏ సంయుక్తంగా చేపట్టిన గార్డినియా, గ్రోవ్‌‌‌‌ విల్లా, గ్రీన్‌‌‌‌వ్యూ అపార్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌లో విల్లాలు, ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు రిజిస్ట్రేషన్‌‌‌‌ శాఖ నిరాకరించింది. 

ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చడాన్ని సవాల్‌‌‌‌ చేస్తూ రాంకీ ఇంటిగ్రేటెడ్‌‌‌‌  టౌన్‌‌‌‌షిప్‌‌‌‌  లిమిటెడ్‌‌‌‌ హైకోర్టులో రిట్‌‌‌‌ దాఖలు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు.. హెచ్‌‌‌‌ఎండీఏ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. అగ్రిమెంట్‌‌‌‌ ప్రకారం రాంకీ రూ.వంద కోట్లు చెల్లించాల్సి ఉండగా..  రూ.25 కోట్లే చెల్లించిందని హెచ్‌‌‌‌ఎండీఏ వాదించింది. ఏ కారణం లేకుండా నిషేధిత జాబితాలో చేర్చడంపై రాంకీ లాయర్‌‌‌‌ అభ్యంతరం చెప్పారు. అగ్రిమెంట్‌‌‌‌ ప్రకారం రాంకీ చేయనప్పుడు హెచ్‌‌‌‌ఎండీఏ చర్యలు తీసుకోలేదని హైకోర్టు జస్టిస్‌‌‌‌ ముమ్మినేని సుధీర్‌‌‌‌కుమార్‌‌‌‌  తప్పుపట్టారు. రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ 22(1) కింద నిషేధిత జాబితాలో చేర్చడం చెల్లదన్నారు. తమ అనుమతి లేకుండా భూముల్లో రాంకీ నిర్మాణాలు చేయడాన్ని అడ్డుకోవాలని రైతులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌‌‌‌ను కొట్టేశారు. భూమి హక్కుల వివాదం సివిల్‌‌‌‌ కోర్టులో ఉందని తెలిపారు. హెచ్‌‌‌‌ఎండీఏ లేఖ ఆధారంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం చెల్లదన్నారు. రాంకీ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను అనుమతించారు.