హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం.. పేరు గొప్ప.. లేఅవుట్లు దిబ్బ.. అప్పులు చేసి మరీ కొన్న జనం.. లబోదిబోమంటున్న ప్లాట్ల ఓనర్లు

హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం.. పేరు గొప్ప.. లేఅవుట్లు దిబ్బ.. అప్పులు చేసి మరీ కొన్న జనం.. లబోదిబోమంటున్న ప్లాట్ల ఓనర్లు
  • అప్పులు చేసి మరీ కొన్న జనం 
  • 18 నెలల్లో మౌలిక వసతులు కల్పన పూర్తి చేస్తామని హామీ  
  • ఇంకా కొనసాగుతున్న రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, కరెంట్ పనులు 
  • లబోదిబోమంటున్న ప్లాట్ల ఓనర్లు 

హైదరాబాద్ సిటీ, వెలుగు : హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం అంటే ఎంతో క్రేజ్​ఉంటుంది. చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. టైటిల్​ క్లియర్​గా ఉండడం, ప్రభుత్వ సంస్థ అనే భరోసానే కారణం. అందుకే..ఉప్పల్​భగాయత్, కోకాపేట, తెల్లాపూర్, కీసర, మేడ్చల్​తదితర ప్రాంతాల్లో హెచ్ఎండీఏ వేసిన ప్లాట్లు హాట్ ​కేకుల్లా అమ్ముడైపోయాయి. ఇదే ఉత్సాహంతో రెండున్నరేండ్ల కిందట అప్పటి బీఆర్ఎస్ ​సర్కారు హయాంలో హెచ్ఎండీఏ మేడ్చల్, రంగారెడ్డి జిల్లా పరిధిల్లోని మోకిల, తొర్రూర్, బహదూర్​పల్లి, కుర్మల్​గూడ, బుద్వేల్, మేడిపల్లి వంటి ప్రాంతాల్లో కూడా లేఅవుట్లు ​వేసి ప్లాట్లను వేలం వేయగా, జనం ఎగబడి కొన్నారు.

అయితే, వారి నమ్మకాన్ని మాత్రం హెచ్ఎండీఏ వమ్ము చేసింది. హెచ్ఎండీఏ రూల్స్​ ప్రకారం ప్లాట్లను అమ్మిన 18 నెలల్లోనే ఆయా లేఅవుట్ల​లో మౌలిక వసతులు కల్పించాలి. రహదారులు, అప్రోచ్​రోడ్లు, తాగునీటి సౌకర్యం, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్​తదితర సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుంది. వేలం వేసేప్పుడు మాత్రం హెచ్ఎండీఏ ఏడాదిన్నరలోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ కూడా ఇచ్చింది. కానీ, వేలం వేసి రెండున్నరేండ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి కాలేదు. దీంతో ప్లాట్లు కొన్నవారు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల మేడిపల్లికి చెందిన కొందరు ప్లాట్ల యజమానులు కమిషనర్​కే ఫిర్యాదు చేశారు. 

ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు వేలం వేశారంటే..

రెండున్నరేండ్ల కింద బుద్వేల్​లో100 ఎకరాలు, మోకిలలో165.35 ఎకరాలు, మేడిపల్లిలో 55 ఎకరాలు, కుర్మల్​గూడలో 16.35 ఎకరాలు, బహదూర్​పల్లిలో 40 ఎకరాలు, తొర్రూర్​లో 170 ఎకరాల భూములను హెచ్ఎండీఏ లేఅవుట్లు ​వేసి విక్రయించింది. దాదాపు 1850 మంది వరకూ ఇందులో ప్లాట్లను కొన్నారు. దీని ద్వారా హెచ్ఎండీఏకు రూ.కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఇప్పటికీ కొన్ని వెంచర్లలో 50 శాతం కూడా మౌలిక సదుపాయాల కల్పన పనులు జరగలేదని ప్లాట్ల యజమానులు ఆరోపిస్తున్నారు.

మరికొన్ని చోట్ల పనులు ప్రారంభించినా ముందుకు సాగడం లేదంటున్నారు. ఇటీవల మేడిపల్లి వెంచర్​లో ప్లాట్లను కొన్నవారు హెచ్​ఎండీఏ కమిషనర్​దగ్గరకు వచ్చి అక్కడి పరిస్థితిని ఆయనకు వివరించారు. బుద్వేల్​లో కొండపై 400 ఎకరాలు లేఅవుట్స్​ వేయగా, దాదాపు రూ.400 కోట్లతో పనులు ప్రారంభించారు. అయితే, ఇప్పటికీ ఇక్కడ సగం పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో అప్పులు తెచ్చి ప్లాట్లు కొన్నవారు లబోదిబోమంటున్నారు. 

నిబంధనలు పాటించడం లేదు

సాధారణంగా ఏ ప్రైవేట్ ​రియల్​ఎస్టేట్​ సంస్థ అయినా వెంచర్​ వేసి ప్లాట్లను అమ్మాలంటే ఆయా వెంచర్లలో 10 శాతం భూములను హెచ్ఎండీఏకు మార్టిగేజ్​ చేయాలి. ఎందుకంటే భూములను అమ్మిన సదరు సంస్థ ఆ లేఅవుట్స్​లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పించక పోతే హెచ్ఎండీఏ తమ వద్ద మార్టిగేజ్​లో ఉన్న 10 శాతం భూములను అమ్మి ఆ డబ్బుతో మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది.

కానీ, ఇక్కడ హెచ్ఎండీఏనే సదరు లేఅవుట్స్​లో మౌలిక సదుపాయాలను కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భూములు కొన్నవారు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి వేలం వేసిన లేఅవుట్స్​​లో మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. 

స్పందించని కమిషనర్​

మోకిల, తొర్రూర్, బహదూర్​పల్లి, కుర్మల్​గూడ, బుద్వేల్, మేడిపల్లి వంటి ప్రాంతాల్లో లేఅవుట్స్​ వేసి మౌలిక వసతులు కల్పించడం లేదనే ప్లాట్ల యజమానుల ఆరోపణలపై వివరణ కోరేందుకు మెట్రోపాలిటన్​ కమిషనర్​సర్ఫరాజ్​అహ్మద్ ను సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.